చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన టీటీడీపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులుపై వేటు పడింది. మోత్కుపల్లి పార్టీ నుంచి బహిష్కరించారు. మోత్కుపల్లి తులసివనంలో గంజాయి మొక్క అని టీటీడీపీ నేతలు ధ్వజమెత్తితే...ఆయన ఇవాళ మధ్యాహ్నం మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు. చంద్రబాబుపై మోత్కుపల్లి చేసిన ఘాటైన విమర్శలు టీడీపీకి వేయి వోల్టుల షాక్ ఇచ్చాయి.
అలా విమర్శలు చేశారో లేదో..ఇలా ఆయనపై బహిష్కరణ వేటు పడింది. టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చెయ్యమని గత జనవరిలో వ్యాఖ్యలు చేయడం దగ్గర మొదలు పెడితే ఇప్పుడు ఎన్టీఆకర్ ఘాట్ దగ్గర పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిపై వేటు వేసేందుకే ఆ పార్టీ మొగ్గు చూపింది. గతేడాది విజయదశమి నుంచి మొదలు పెట్టి ఎన్టీఆర్ జయంతి వరకు మోత్కుపల్లి చేసిన కార్యక్రమాలన్నీ పార్టీని పూర్తిగా బలహీనపరిచేదిగా ఉందన్నారు...తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు..ఎల్.రమణ.
గవర్నర్ పదవి రాదని తెలిసి మోత్కుపల్లి విపరీత ధోరణితో ప్రవర్తించారని రమణ ఆరోపించారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి కోసం చంద్రబాబు చొరవచూపారని..కానీ కేంద్రం గవర్నర్ పదవి ఇవ్వలేదని అన్నారు. మొత్తానికి మోత్కుపల్లి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతోంది.