వైసీపీ అధినే జగన్‌పై దాడిని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్రంగా ఖండించారు.. జగన్ పై దాడి పిరికిపందల చర్య అన్న ఆయన.. జగన్ పై దాడి విషయంలో వైసీపీ నేతలు టీడీపీపై చేస్తున్న ఆరోపణలు సరికాదని మంత్రి ఆనందబాబు హితవు పలికారు. దాడులకు పాల్పడే నీచమైన చరిత్ర తమకు లేదన్నారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇటువంటి దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. జైళ్లలో రిమాండ్‌లో ఉన్న ఖైదీలను చంపించిన ఘనత వైసీపీకే ఉందని ఆనందబాబు ఆరోపించారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా ఇలాంటివి జరుగుతాయన్న హీరో శివాజీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపడుతోందని.. విచారణలో వాస్తవాలు కచ్చితంగా బయటకు వస్తాయని మంత్రి వివరించారు. ఇలాంటి ఘటనలతో సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమేనేమో అని నమ్మాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రముఖ నాయకుడిపై దాడి జరుగుతుందని శివాజీ చెప్పారని గుర్తు చేశారు. అయినా ఎయిర్ పోర్టులోకి చెక్‌ఇన్ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని తెలిపారు.. ఈ ఘటన పలు అనుమానాకు దారి తీస్తోందని ఆయన తెలిపారు.