మతిభ్రమించిన మాణిక్యాలరావు

Update: 2018-01-04 05:03 GMT


పైడికొండల మాణిక్యాలరావు.... ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి మహిళల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి వెలగబెడుతున్న ఈయన మతిభ్రమించి మాట్లాడారు. గజల్‌ శ్రీనివాస్‌ గలీజు పనులను సాక్ష్యాధారాలతో సహా కళ్లకు కట్టినట్లు బాధితురాలు ప్రపంచం ముందుంచితే మంత్రి గారు మాత్రం ఆయన చాలా మంచోడంటూ సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. తన దగ్గర పనిచేసే మహిళతో గజల్‌ శ్రీనివాస్‌ అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్న వీడియోలు బయటపడినా మాణిక్యాలరావు మాత్రం నిస్సిగ్గుగా శ్రీనివాస్‌ తరపున వకల్తా పుచ్చుకున్నారు. గజల్‌ శ్రీనివాస్‌ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, ఆయన తప్పు చేయడంటూ బాధితురాలి మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు.

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరిగితే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడే వ్యక్తులు మన మధ్యలో ఉండటం దుర్మార్గం అదీ ఒక మంత్రి అయితే మరీ దుర్మార్గం ఆ దుర్మార్గమైన ఆలోచన చేసింది మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా కావొచ్చు.... కానీ ఆ వ్యక్తి తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసు.... ఆ వ్యక్తి తప్పు చేయడని వ్యాఖ్యానించిన దురంహకార ధోరణి మాణిక్యాలరావుది. ఒక మహిళ తనపై జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని సాక్ష్యాధారాలతో సహా కళ్లకు కట్టినట్లు ప్రపంచం ముందుంచితే... మతిలేని మతిమాలిన వ్యాఖ్యలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని మంత్రి మాణిక్యాలరావు. 

ఈ వ్యక్తి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి.... మాణిక్యాలరావును ఎన్నుకోవడంలో ఎంతోమంది మహిళలు కూడా ఓట్లేశారు.... ఈ వ్యక్తి మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం కూడా చేశారు. మాణిక్యాలరావుకి చట్టం గురించి ఏమీ తెలియదని అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. ఇతనికి అన్నీ తెలుసు. గజల్‌ శ్రీనివాస్‌... తన దగ్గర పనిచేసే ఓ మహిళతో బలవంతంగా బాడీ మసాజ్‌ చేయించుకోవడం... తాకరాని చోట తాకమని ప్రేరేపించడం.... ఇలాంటివన్నీ తప్పని మంత్రికి తెలియదా? భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లో చేసిన చట్టం మేరకు..... యజమాని తన దగ్గర పనిచేసే మహిళల పట్ల ఏమాత్రం అసభ్యంగా ప్రవర్తించినా కఠిన శిక్షలే ఉన్నాయి. ఇది కూడా మంత్రికి బాగా తెలుసు... ఒకవేళ తెలియదని బుకాయిస్తే మంత్రిగా ఆయన పదవిలో ఉండటానికి అనర్హుడు. మహిళా లోకమంతా ఒక్కటై గజల్‌ శ్రీనివాస్‌ చేసింది తప్పని ఘోషిస్తుంటే... అవన్నీ అరణ్య రోదనలేనా? నిర్లజ్జగా నిస్సిగ్గుగా మంత్రి మాణిక్యాలరావు మరి ఏ ముఖం పెట్టుకుని గజల్‌ శ్రీనివాస్‌ని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారో తెలియాల్సి ఉంది.

తెలంగాణ పోలీసులు అన్ని ఆధారాలతో గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్ట్‌చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కానీ గజల్‌ శ్రీనివాస్‌ తరపు న్యాయవాది.... తన క్లయింట్‌ నిరపరాధి అని చెబుతూ బెయిల్‌ మంజూరు చేయాలని అర్ధించినా కానీ.... గజల్‌ శ్రీనివాస్‌ను కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. కేసు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంటే.... మంత్రి మాణిక్యాలరావు.... మీడియా ముందు గజల్‌ శ్రీనివాస్‌కి కితాబివ్వడం ఎంతమాత్రం వివేకమో, ఆయన విజ్ఞత ఏపాటిదో బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. మరి మహిళలంటే ఎంతో గౌరవముందని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ము‌ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో తన పక్కనే ఈ మాణిక్యాలరావును ఎలా కూర్చుండబెట్టుకుంటారని మహిళా లోకం ప్రశ్నిస్తోంది.

తన దగ్గర పనిచేసే మహిళతో అసభ్యకరమైన రీతిలో అత్యంత జుగుప్సాకరంగా ఉన్న గజల్‌ శ్రీనివాస్‌ వీడియోలు బయటపడ్డాయి. ఆ మహిళ ఇప్పుడు పరారీలో ఉంది. ఇంత జరిగినా తనకు గజల్‌ శ్రీనివాస్‌ తెలుసని, అతనేదో ప్రపంచాన్ని ఉద్దరించేవాడంటూ మాట్లాడి మంత్రి మాణిక్యాలరావు తన స్థాయిని దిగజార్చుకున్నారు. గజల్‌ శ్రీనివాస్‌‌ను వెనుకేసుకొచ్చిన మంత్రి మాణిక్యాలరావు ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి.
1. తన దగ్గర పనిచేసే పరాయి మహిళ పార్వతితో అసభ్యకరమైన పనులు చేయించుకున్న గజల్‌ శ్రీనివాస్‌ అంత నీతిమంతుడా?
2. బాడీ మసాజ్‌ పేరుతో బాధితురాలితో కాళ్లు పట్టించుకోవడం, ప్రైవేట్‌ పార్ట్స్‌ తాకాలనడం మాణిక్యాలరావుకి ఎక్కడ నీతివంతంగా అనిపించిందో?
3. అదే మంత్రి సంబంధీకులతో గజల్‌ శ్రీనివాస్‌ ఇలాగే ప్రవర్తించి కోరిక తీర్చమని అడిగితే... మాణిక్యాలరావు సమాధానం ఇలాగే ఉంటుందా?    
4. తన దగ్గర పనిచేసే మహిళా ఉద్యోగులతో యజమాని ఏమాత్రం అసభ్యంగా ప్రవర్తించినా... కఠినంగా శిక్షించే చట్టాలున్నాయన్న సంగతి మంత్రి మాణిక్యాలరావుకి తెలియదా?

మహిళలకు ఏ అన్యాయం జరిగినా నిగ్రహం, నిబద్ధత పాటించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఆ సమాజంలో ఉన్న మాణిక్యాలరావు ఒక నిందితుడి తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడటం న్యాయవ్యవస్థను మరీ ముఖ్యంగా మహిళా లోకాన్ని అవమానించేలా హేళన చేసిదిగా ఉందని మహిళా సంఘాలు భావిస్తున్నాయి. ఇక ఈ మాణిక్యాలరావుపై ఏం చర్యలు తీసుకుంటారో ఎలాంటి వివరణ ఇప్పిస్తారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, ము‌ఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనా ఉంది.

Similar News