తన కుమారుడు, నటుడు రవితేజ, తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. రవితేజ, సాయిపల్లవిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతుందని, వైరల్ అవుతున్నట్టుగా, తన కుమారుడికి, సాయిపల్లవికి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారమూ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించనన్నారు. అవాస్తవమైన విషయాలను నిరాధారమైన ఆరోపణలతో ప్రచారం చేయొద్దని తెలిపారు. ఇతరుల జీవితాలపై మచ్చ వేసేలా వార్తలు రాయడం తగదని మంత్రి గంటా సూచించారు. తన కుమారుడికి వివాహమైందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇలాంటివి ఎలా ప్రచారం చేస్తారని గంటా ప్రశ్నించారు. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కుమారుడు రవితేజ ఇటీవల ‘జయదేవ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ ఆ సినిమాలో కనిపించారు.