తండ్రి చేసిన క్రూరమైన దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా హైదరాబాద్ ఎర్రగడ్డలో నిన్న మనోహరాచారి చేసిన దాడిలో మాధవి మెడ, చేతిపై బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ప్రస్తుతం అపస్మారస్థితిలో ఉన్న మాధవి మృత్యువుతో పోరాడుతోంది.
మాధవి ఆరోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు ఉదయం 11 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉందని మరో 48 గంటలు గడిస్తేనే గానీ ఆమె పరిస్థితి స్పష్టంగా చెప్పలేమని అన్నారు. దాడి ఘటనలో మాధవికి మెడ, చెవి, ముఖ కండరాలు తీవ్రంగా గాయపడ్డాయని డాక్టర్లు వివరించారు. ఎడమ చేతి ఎముక మొత్తం తెగిపోయి చర్మం మాత్రమే వేలాడుతున్న స్థితిలో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారని ఆపరేషన్ చేసి చేతిని అతికించినట్లు చెప్పారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో మాధవి తీవ్ర ఒత్తిడికి లోనైందని దాని ప్రభావం ఆమె కిడ్నీపైనా పడిందన్నారు.
మాధవి ఆస్పత్రికి వచ్చే సమయానికి చాలా రక్తస్రావం జరగడంతో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు. 8 గంటలపాటు శ్రమించి రక్తస్రావాన్ని తగ్గించి ఆరు బాటిళ్ల రక్తాన్ని ఎక్కించామని చెప్పారు. మాధవి మెడపై ఆమెకు తీవ్ర గాయమైంది. ముఖకవళికలకు సంబంధించిన నరాలు, మెదడుకు వెళ్లే ప్రధాన నరం, ఎడమ చేయి ఎముక పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. మాధవికి మెడ దగ్గర, చేతి దగ్గర మూడు సర్జరీలు చేశామన్నారు. అంతా బాగానే ఉన్నా మరో 48 గంటలు గడిస్తే గానీ మాధవి కండిషన్ గురించి చెప్పలేమన్నారు. మాధవికి అధునాతన చికిత్స అందిస్తునప్పటికీ ఆమె శరీరం స్పందించే తీరును బట్టే కోలుకోవడం జరుగుతుందని చెప్పారు.
మరోవైపు సొంత మామ చేతిలో కత్తి దాడికి గురైన మాధవి భర్త సందీప్ ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. అతను తన భార్య ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన ప్రాణాలకు మాధవి తన ప్రాణాన్ని అడ్డుపెట్టిందని ఆమెకు ఏమైనా అయితే తట్టుకోలేనని భోరున విలపించాడు. కులాల పట్టింపులే మాధవితో తన ప్రేమకు అడ్డంకిగా మారాయని సందీప్ తెలిపారు. తక్కువ కులంలో పుట్టడం నేరమా అని సందీప్ ప్రశ్నించాడు. అయితే మాధవి ఆరోగ్యంపై నిజాలు దాస్తున్నారనే అనుమానాన్ని సందీప్ వ్యక్తం చేశాడు. మాధవి ఎలా ఉన్నా ఫర్వాలేదని బతికి వస్తే చాలని అంటున్నాడు. గతంలో మాధవి కుటుంబ సభ్యులు సందీప్‌ను చాలాసార్లు బెదిరించారని అతని తల్లి తెలిపారు. తక్కువ కులమనే కారణంతోనే మాధవి తల్లిదండ్రులు , బంధువులు సందీప్‌తో పెళ్ళికి అంగీకరించలేదనీ దాంతో తామే వివాహం జరిపించామని ఆమె వివరించారు.