ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని ఉద్దరించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెగ తాపత్రయపడిపోతున్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో అడుగుపెడితే స్వామికార్యం.. స్వకార్యం అన్నచందంలా అటు ప్రజా సమస్యలు, ఇటు ఓటుబ్యాంకు ను కొల్లగొట్టొచ్చని తన తండ్రి వైఎస్ కు అచ్చొచ్చిన పాదయాత్రను నమ్ముకున్నారు. ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరాయంగా పాదయాత్రతో దూసుకుపోతున్నారు. కానీ జగన్ పాదయాత్రకు ముందే ఏం ఊహించారో అదేం జరగడంలేదని..దానికి కారణం ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అని లోటస్ పాండ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అటు టీడీపీ నేతలు కానీ, ఇటు కాంగ్రెస్ నేతలు కానీ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని ఆశించారు. కానీ భంగపడ్డారు. దీనంతటికి క్లాస్ లీడర్ అని పిలుచునే విజయసాయిరెడ్డేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వేరెవరైనా వైసీపీ లో చేరాలనుకుంటున్నట్లు అనుమానం వస్తే చాలు ..వెంటనే ఆపార్టీ నేతలు సదరు పార్టీ మారాలనుకున్న నేతతో మంతనాలు జరుపుతారు. ఆ ప్రయత్నం తరువాత జగన్ స్నేహితుడు , పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగుతారు.
కానీ కొణతాల విషయం వైసీపీ పాచికలు పారలేదనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ వైసీపీ లో చేరుతారనే వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి కొణతాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏమైందో తెలియదు కొణతాల సైలెంట్ అయ్యారు.
ఇక బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఏపీ ప్రజలు, ఇరు పార్టీలకు చెందిన నేతలు గొగ్గొలు పెడుతుంటే విజయసాయిరెడ్డి మాత్రం బడ్జెట్ బేషుగ్గా ఉందంటూ నోరు జారారు. దీన్ని ప్రధాన అస్త్రంగా చేసుకున్న అధికార పార్టీ నేతలు విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ తో వైసీపీని కార్నర్ చేశారు.
అయితే వైసీపీ కీలకమైన బొత్సా సత్యనారాయణ, కొలుసు పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు వంటి వారిని చంకలో పెట్టుకుని జగన్.. ఇలా అనుభవం లేని విజయసాయి వంటి వారిని దగ్గర చేయడం అధికారం మొత్తం ఆయనకే అప్పగించడం వల్ల జగన్ కు ఒరిగింది ఏమీ లేదని అంటున్నారు.