టీఆర్‌ఎస్ ఇటీవల ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, నియోజకవర్గాల్లో మలివిడుత ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అభ్యర్థులను ప్రకటించి 45 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారం తీరును పార్టీ అధినేత స్వయంగా తెలుసుకుంటారు. దాదాపు 45 రోజుల ప్రచారం మిగిలిఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార సరళి, పార్టీ అభ్యర్థులుగా అనుసరించాల్సిన పద్ధతులను సదస్సులో వివరిస్తారు.
పార్టీ ఇటీవల ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలు, నాలుగున్నరేండ్లుగా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజలకు వివరించడంపై అవగాహన కల్పిస్తారు. అభ్యర్థులను ప్రచారానికి సన్నద్ధం చేయడం, ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా.. టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేసేలా అవగాహన కల్పించడంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. ప్రచారంలో రాబోయే రోజులు మరింత కీలకమైన నేపథ్యంలో పార్టీ అభ్యర్థులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో ఒక విడుత ప్రచారాన్ని పూర్తిచేశారు. ప్రజలు బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో తుది విడుత ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రధాన ప్రచారాంశం కానున్నది.