'ప్రజా సంకల్పయాత్ర, సర్వేల జోష్‌లో ఊపు మీదున్న ప్రతిపక్ష వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు మరో కార్యక్రమం చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ ప్లీనరిలో అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల ప్రచారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. ఏపీలో అధికార టీడీపీని ఎదుర్కొనేందుకు ఏడాదిన్నర క్రితమే వ్యూహారచన చేసిన వైసీపీ ఏమాత్రం తప్పిదాలకు తావు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రజా సమస్యలపై నిత్య పోరాటంతో పాటు అధినేత జగన్ ఇచ్చిన హామీలను ప్రచారం చేయడమే లక్ష్యంగా నేటి నుంచి కావాలి జగన రావాలి జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపట్టినట్టు పార్టీ నేతలు ప్రకటించారు.
ఈ కార్యక్రమం ద్వారా నవరత్నాలతో పాటు టీడీపీ నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని నేతలు ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చని చంద్రబాబు మట్టి నుంచి ఇసుక దాకా దోపిడికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యకర్తలకు సూచించారు. నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి అర్ధమయ్యే రీతిలో వివరించాలంటూ కోరారు.