ఏపీకి జరిగిన అన్యాయంపై జేఎఫ్‌సీ ఏం తేల్చనుంది. సమావేశాలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా నివేదిక ఇవ్వడంలో ఆలస్యమెందుకు..? అసలు జేఎఫ్‌సీ ఇవ్వబోతున్న నివేదికలో ఏముంది..? తప్పు ఎవరిదని జేఎఫ్‌సీ తేల్చనుంది.
ఏపీకి జరిగిన అన్యాయంపై నిగ్గు తేల్చడానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ప్రత్యేక హోదా, ప్యాకేజీ, విభజన అంశాల విషయంలో ఎవరి పాత్ర ఎంత..? రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి కారకులెవరన్నదానిపై చర్చించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నివేదికను కూడా రూపొందించినట్టు తెలుస్తోంది.
కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని తెరమీదకు తెచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం దానికి ఒప్పుకోవడానికి గల కారణాలను కూడా జేఎఫ్‌సీ నివేదికలో చేర్చినట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో జేఎఫ్‌సీ నివేదికకు ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే లోగా నివేదిక ప్రజల ముందు ఉంచితే ఎంపీలు ఆ అంశాలపై పార్లమెంటులో గళం విప్పే అవకాశం ఉందని జేఎఫ్‌సీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ ఆలస్యంగా స్పందించారన్న ప్రతిపక్ష ఆరోపణలకు చెక్ పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యవతను టార్గెట్ చేసుకుంటూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు పవన్. అయితే, రాష్ట్రంలో మారుతున్న తాజా పరిణామాలతో సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాకు జైకొట్టడంతో.. జేఎఫ్‌సీ దాన్ని ఎలా పరిగణిస్తుందో చూడాలి.