చిన్నా లేదు పెద్దా లేదు, పగలు లేదు రాత్రీ లేదు, ఆ ఊరు ఊరంతా దురద. ప్రతీ ఒక్కరికీ పగలు లేదు, రాత్రి లేదు, కంటికసలు కునుకే లేదు. 24 గంటలూ గీరుకుంటూనే కనిపిస్తారు. ఎవరైనా అక్కడికి వెళ్లి షేక్‌హ్యాండ్ ఇస్తే, తిరిగి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ గోక్కుంటారు. ఇక్కడా అక్కడా లేదు, ఒళ్లంతా దురదే, ఊరంతా దురదే. రెండు మూడు నిమిషాలు దురద పెడితేనే చిరాకు పడతాం. అలాంటిది ఒక నెలరోజులుగా దురద పెడుతుంటే, 24 గంటలనూ నిద్రలేకుండా గీరుకుంటూ ఉంటే, వినడానికి మనకే ఇలా ఉంటే, ఇక ఆ బాధ అనుభవిస్తున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది..? కడప జిల్లా పోరుమామిళ్ల మండంలోని చిన్నపుల్లీడు, పెద్దపుల్లీడు గ్రామాల్లో చిన్నారుల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ ఒకటే సమస్య. అదే దురద.
చిన్నపుల్లీడు, పెద్దపుల్లీడు కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిధిలోని రెండు చిన్న గ్రామాలు. ఇక్కడి ప్రజలు గడచిన నెల రోజులుగా వింత సమస్యతో సతమతమవుతున్నారు. ఇది అందరికి వింతగానే ఉండొచ్చు కానీ, గ్రామస్ధులకు మాత్రం కంటినిండా నిద్ర కూడా లేకుండా చేస్తొంది. కూలీ నాలీ చేస్తే గానీ రోజు గడవని పరిస్ధితి. ఇలాంటి ప్రజలకు ఈ వింత సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తొంది.
కారణం తెలియదు గానీ తీవ్రమైన దురద ఇక్కడి ప్రజలకు అనేక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ దురద కారణంగా పగలనకా, రాత్రనకా గీరుకోవడంతోనే సరిపోతుంది. ఈ దురద ధాటికి గీరుకోవడంతో ఒళ్లంతా దద్దుల మయమవుతుంది. చిన్న పిల్లలు మొదలు ముసలి వాళ్ల వరకు ఇదే సమస్య. సాధారణంగా దురద ఒక రోజు ఉంటేనే ఎవ్వరికైనా విసుగు విరక్తితో చిరెత్తుకోస్తుంది. అలాంటిది చిన్నపుల్లీడు, పెద్దపుల్లీడు గ్రామస్తులు నెల రోజులుగా బాధపడుతూనే ఉన్నారు.
అసలు గ్రామస్థులకు ఈ సమస్య ఎందుకు ఎదురయ్యిందన్నది అంతుబట్టడం లేదు. ఒకరు నీటి కలుషితం అంటుంటే మరొకరు పత్తి పురుగుల కారణంగా ఈ దురద వచ్చిందని చెప్తున్నారు. కానీ అసలు వాస్తవమేంటో, సరైన కారణమేంటో ఎవ్వరికీ తెలియదు.
పెద్దపుల్లీడు, చిన్నపుల్లీడు గ్రామ ప్రజలకు దరకు కారణం స్పష‌్టంగా తెలీదు. అయితే గ్రామంలో మాత్రం మంచినీటి సరఫరా కూడా కలుషితంగానే ఉంది. సుమారు ఏడాది క్రితం గ్రామాలకు నీటిని సరఫరా చేసే పైప్ లైన్ డ్యామేజ్ అయినా ఇంత వరకూ పట్టించుకున్న నాధుడే లేడు. దీంతో అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉన్న నీటి కుళాయే వీరికి దిక్కు. ఈ కలుషిత నీటిని తాగడంతోనే దురద వచ్చిందన్నది పలువురి అభిప్రాయం.
ఇటీవలే పెద్దపుల్లీడు, చిన్నపుల్లీడు గ్రామస్తులు పత్తి పంటను కోశారు. దాంతో ఆ పంటకు ఉన్న పురుగులు కుట్టడం వల్లే ఇలా వచ్చిందని కొందరు చెప్తున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఇలా వచ్చిందేమో అన్నది మరికొందరి వాదన. ఇలా అంతుపట్టని అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. అయినా అధికారులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
పోరుమామిళ్ల మండలంలోని చిన్నపుల్లీడు, పెద్దపుల్లీడు గ్రామస్తులు వ్యవసాయంపైనే అధారపడి బతుకుతున్నారు. దీంతో వైద్యానికి సడపడా డబ్బులు లేని పరిస్ధితి. అయినప్పటికి ఒక్కొక్కరు వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేశారు. అయినా దురద నుంచి విముక్తి కలగడం లేదు. ఇక్కడ వైద్య సేవలు అందించాల్సిన వైద్యుడు శిక్షణ నిమిత్తం వెళ్లారు. దీంతో వైద్య సేవలు అందే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు వైద్య శిభిరాన్ని నిర్వహించి దమకు దురద నుంచి విముక్తి కల్పించాలని, మంచి నీటి పైప్ లైన్ పనులు చేపట్టి శుభ్రమైన నీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.