లక్నో లో జరిగిన భారత్-వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో సునాయాస విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్ చతికిలబడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తో సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. 58 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. నిన్న జరిగిన టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు.