భారీ స్కోరు దిశగా పయనిస్తున్న టీమిండియా

Update: 2018-10-04 13:49 GMT

ఇప్పటికే ఆసియా కప్ గెలిచి ఊపుమీదున్న భారత్ టెస్ట్ సిరీస్ పై కన్నేసింది. ఇవాళ్టి(గురువారం)నుంచి వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది.  ఆట ముగిసే సమయానికి కోహ్లి(72 బ్యాటింగ్‌), రిషబ్‌ పంత్‌(17 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన టీమిండియా ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షాలు ప్రారంభించారు. అయితే తొలి ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ కు చేరడంతో పృథ్వీ షాతో జత కలిసిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కేవలం 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న షా.. ఆపై అదే జోరును కొనసాగించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడమే కాకుండా, పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.  99 బంతుల్లో 15 ఫోర్లతో శతకం పూర్తి చేసి రికార్డు  నమోదు చేశాడు పృథ్వీ షా. కాగా పూజారా, షా జోడి 206 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని అందించారు. పుజారా(86; 130 బంతుల్లో 14 ఫోర్లు) ఔటయ్యాడు. ఆ తరువాత షా(134; 154 బంతుల్లో 19 ఫోర్లు) కూడా ఔట్‌ అయ్యాడు. 

Similar News