నల్గొండ జిల్లా మర్రిగూడ యువతి ప్రియాంక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు హన్మంతు ఇచ్చిన సమాచారంతో ప్రియాంక ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మల్లేపల్లిలో బాబు రాజ్‌కిరణ్ నాగార్జునసాగర్‌లో పాప ఆచూకీ కనుగొన్నారు.
ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా పదేళ్లు గడిచిపోవడంతో... తన పాపం సమాధి అయిపోతుందని భావించిన హంతకుడ్ని ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒకే ఒక్క ఫొటో పట్టించింది. దాంతో నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని మరోసారి రుజువైంది. ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డల్ని కని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకొని, మొదటి భార్యను ఎవరికీ తెలియకుండా చంపేసి రెండో భార్యతో కాపురం చేస్తున్న నిందితుడు ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకేపల్లికి చెందిన మోర హన్మంతు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తన ప్రేమ పెళ్లి గురించి అటు అమ్మాయి తల్లిదండ్రులకు ఇటు తన తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. మూడేళ్లు కాపురంచేసి ఇద్దరు బిడ్డల్ని కన్నాడు. అయితే హన్మంతు ప్రేమ పెళ్లి గురించి తెలియని అతడి తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి చేశారు. దాంతో మొదటి భార్యను వదిలించుకోవాలనుకున్న హన్మంతు పక్కా ప్లాన్‌తో ప్రియాంకను చంపి మర్రిగూడ వెంకేపల్లి పాడుబడ్డ బావిలో పడేశాడు. అదే బావిలో గ్రామస్తులు జంతువుల కళేబరాలు, చెత్తాచెదారం వేస్తుండటంతో ప్రియాంక హత్య విషయం బయటికి రాలేదు. అయితే అక్క కోసం కొన్నేళ్లుగా వెతుకుతోన్న తమ్ముడు ఉపేంద్రాచారి అన్వేషణతో హన్మంతు నేరచరిత్ర బయటపడింది.
ప్రియాంక రెండోసారి గర్భం దాల్చినప్పుడు అనుకోకుండా హైదరాబాద్‌లో తమ్ముడు ఉపేందర్‌కి కనిపించడంతో అక్క ప్రేమ పెళ్లి విషయం తెలుసుకున్నాడు. అయితే ఆ తర్వాత అక్క కనిపించకపోవడంతో ఆమె ఆచూకీ కోసం ఏళ్ల తరబడి అన్వేషణ జరిపాడు. అయితే ఫేస్‌బుక్‌లో హన్మంతు ఫొటోను గుర్తుపట్టిన ఉపేందర్ తన అక్క కాకుండా మరో మహిళ ఉండటంతో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా మర్రిగూడ పీఎస్‌లోనూ కంప్లైంట్ చేశాడు. పోలీసులు హన్మంతును అదుపులోకి తీసుకొని విచారించడంతో ప్రియాంక హత్య వెలుగుచూసింది.