కాళ్ళకు ఇంకా కత్తులు కట్టకుండానే బలిసిన కోడి పుంజులు కొట్లాటకు దిగుతున్నాయి. జీడిపప్పు, పిస్తా మేస్తూ ఎక్సర్ సైజ్‌లు చేస్తూ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పందెం రాయుళ్ళు ఎవరి సన్నాహల్లో వారు సిధ్ధమవుతున్నారు. కోడి పందెలతో సంకాంత్రిలో మరింత జోష్ నింపనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలపై హెచ్ ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
ఉభయ గోదావరి జిల్లాలో కోడిపందాలకు ఎంతో మోజు. ఏటా సంక్రాంతికి కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేస్తారు. మూడు నెలల ముందుగానే కోడి పుంజులకు జీడిపప్పు, పిస్తా తినిపించడం మొదలుపెడతారు. ప్రత్యేక ఎక్సర్ సైజ్ లతో బలిష్టంగా తయారుచేస్తారు. ఒక్కో పందెం కోడి 5వేల నుండి 50వేల వరకూ ధర పలుకుతోంది. బరిలోకి దింపే ముందు కుక్కుటపురాణాన్ని పఠనం చేస్తూ ముహుర్తానికి పోటికి పంపుతారు. కోళ్ళను పోరులోకి దించేవారి కంటే ఆస్వాదించేవారు, పందాలు కాసేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఆక్షణంలో లక్షల రూపాయలు సైతం విసిరేస్తుంటారు. కోడి పందాలంటే అంత పిచ్చి అందుకే ఈ పోటీలు తప్పనిసరిగా ఉండాలని ప్రజాప్రతినిధుల పై ఒత్తిళ్ళు ఉంటాయి.
తెలంగాణలో స్థిరపడ్డ గోదావరి వాసులు తప్పనిసరిగా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వస్తారు. వీరి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది చేతి చమురు వదిలించుకునేవారే ఉంటారు. డబ్బులు పోతే పోని మూడు రోజులు సరదాగా గడిచిపోయిందనే ఆనందం మిగిల్చుకుంటారు. బాహుబలి సినిమా సెట్టింగు తరహాలో రెండు మూడు చోట్ల పోటీలకు సరంజామా మొదలైంది. వందల కోళ్లు ఏకకాలంలో బరిలోకి దిగేందుకు భారీ ఖాళీ స్ధలాలను చదును చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాలలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. గత ఏడాది నుండి పెద్దాపురం, పిఠాపురం, గోకవరం, కోరుకొండ కాకినాడ రూరల్ లో కూడా పోటీలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఐ.భీమవరం, వెంప, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
కోడిపందాలు ఒక ఎత్తు అయితే ఆ పందాలను రంజుగా సాగించేందుకు మందు, విందు, గుండాట దుకాణాలు అక్కడ ప్రత్యక్షమవుతుంటాయి. ఇదేమి చిన్నవ్యాపారం కాదు కోడి పందాల దగ్గర మద్యం అమ్మకాలు షాపు పెట్టాలంటే నిర్వాహకులకు లక్షల రూపాయల అద్దె చెల్లించాలి. ఈ పోటీలను జూదంగా భావించకుండా సంప్రదాయ క్రీడగా భావించాలని పందెం రాయుళ్లతో పాటు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. గతంలో కోడి పందాలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో పోలీసుల భయం ఉండేంది. ఈ సారి కోడి పందెలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో పందెం రాయుళ్ల ఆనందానికి అంతులేదు. భారీగా కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంబరాల సంక్రాంతికి మరింత మజా ఇవ్వనున్నారు.