తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన హైకోర్టు వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చేతిలోని హెడ్ సెట్ విసిరేశారు. ఆ హెడ్ సెట్ తగిలి మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన శాసనసభ మొత్తం కాంగ్రెస్ సభ్యులతో పాటు కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
శాసనసభ సభ్యత్వాల రద్దుపై కోమటిరెడ్డి, సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత ద్వేషంతో తమ సభ్యత్వాలను రద్దు చేశారంటూ కోర్టుకు విన్నవించారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా శాసనసభలో జరిగిన గోడవకు సంబంధించిన వీడియో ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సానుకూలంగా స్పందించిన అడ్వకేట్ జనరల్ అనంతరం తన పదవికి రాజీనామా చేయడంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో వీడియో సాక్ష్యం లేకుండానే విచారణ జరిపిన న్యాయస్ధానం చివరకు తీర్పును వెలవరించింది. కోర్టు తీర్పుతో కోమటిరెడ్డి వెంటకరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు.