లోకం ఎందుకిలా మారిపోతోందో అర్థం కావడం లేదు. ముక్కుపచ్చలారని చిన్నారి అని కూడా చూడకుండా.. ఓ దుర్మార్గుడు దారుణంగా చిదిమేశాడు. ఆడుకోవడం తప్ప.. లోకం గురించి ఏ మాత్రం అవగాహన లేని నాలుగేళ్ల చిన్నారిని మాయ చేసి మత్తులోకి దించి.. అఘాయిత్యం చేసి ఆపై హత్య చేశాడు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన.. సమాజాన్ని తల దించుకునేలా చేసింది. పోలీసులనే కంటతడి పెట్టేలా చేసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కేతావత్ బాలూనాయక్.. అలియాస్ పుల్లూ నాయక్.. ఎనిమిదేళ్ల క్రితం నల్లగొండ నుంచి గుంటూరు జిల్లా కొత్తూరులో స్థిరపడ్డాడు. గొర్రెలు మేపుకుంటూ బతుకీడుస్తున్నాడు. ఈ మధ్యే.. నాలుగేళ్ల ఓ చిన్నారిని చూసి.. పాడు ఆలోచన చేశాడు. ఆ అభాగ్యురాలి తండ్రితో పరిచయం పెంచుకుని.. అతడికి స్నేహితుడిగా మారాడు. కల్లు తాగించి అతడిని మత్తులో దింపాడు.
తర్వాత.. అదును చూసి చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. విషయం బయపడితే ఇబ్బంది అనుకున్నాడేమో.. కనీసం పసిపాప అన్న ఇంగితం కూడా లేకుండా.. హత్య చేశాడు. చివరికి పోలీసుల విచారణలో విషయం బయటపడింది. ఇలాంటి దుర్మార్గుల వ్యవహారం.. తల్లిదండ్రులకు నిజంగా ఓ కనువిప్పు. ఎవరు ఎలాంటివారో తెలియకుండా స్నేహాలు చేసినా.. నమ్మి పిల్లల బాధ్యత అప్పగించినా.. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని.. బాలూనాయక్ ఉదంతం మరోసారి నిరూపించింది.
తల్లిదండ్రులారా.. బహుపరాక్.. మీ పిల్లలు జాగ్రత్త. అమాయకంగా కనిపించేవాళ్లంతా మంచి వాళ్లు కాదని తెలుసుకోండి. జాగ్రత్తపడండి.