బుడతల బురద నీటి అడుగులు... సిక్కోలు చిన్నోళ్ల కన్నీటి గాథలు

Update: 2018-10-31 12:39 GMT

ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తాం విద్యా వ్యవస్థను గాడిలో పెడతాం ఇదీ ఎన్నికల ముందు నాయకులు చెప్పే మాటలు అయితే నాయకుల మాటాలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లా A.S.పేటలోని పురపాలక ప్రాధమిక పాఠశాల. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం A S పేటలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పురపాలక ప్రాధమిక పాఠశాలగా ఉన్న ఈ బడికి నాలుగు భవనాలు ఉన్నాయి. అందులో మూడు శిథిలావస్థకు చేరుకోవటంతో ఒక్క భవనం లోనే అన్ని తరగతులు నిర్వహించుకోవ్వాల్సివస్తోంది. కనీసం సరైన రోడ్డు కూడా లేదు.  వర్షం వచ్చిందంటే చాలు పాఠశాల ఆవరణ మొత్తం చిన్న కొలనును తలపిస్తూ మురుగు నీటితో నిండుకుంటుంది. అయితే బడిలోకి వెళ్ళాలి అంటే తప్పక అదీ మురుగు నీటిలో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి దీంతో చాలా మంది పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు..  

సుమారు 60 మంది విద్యార్థులు చదువుకొనే ఈ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. విశాల ప్రాంగణం, ప్లే గ్రౌండ్ వంటి సౌకర్యాల మాట ఎలా ఉన్నా కనీసం వెళ్లేందుకు రోడ్ మార్గం కూడా సరిగ్గా లేదు ఇక తాగునీరు , మరుగుదొడ్లు లేక విద్యార్థినీ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు సర్కార్ బడులలో పిల్లలు చదువుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా కల్పించటంలేదు. దీంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. 

అయితే రోడ్డు మార్గం నిర్మాణానికి 9 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగటం లేదు ఈ విషయం పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు సర్కార్ పాఠశాలలలో చేరాలని ప్రభుత్వాలు ప్రచారాలు చేస్తున్నా అందుకు తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Similar News