నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీకి ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ వారంలోనే డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన దస్త్రం ఒకటి రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చేరనుంది. ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 25,26 తేదీల్లో డీఎస్సీ ప్రకటన విడుదల చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంబంధించిన దస్త్రాన్ని సోమ, మంగళవారాల్లో ప్రభుత్వానికి పంపాలని భావిస్తున్నారు. డీఎస్సీ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. కొన్ని ఇబ్బందులున్నా ఆన్ లైనే మేలని పాఠశాల విద్యా శాఖ అంటుంది. మరోవైపు డీఎస్సీకి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సిలబస్ ఖరారు చేసింది. ఈసారి ఎస్జీటీలకు టెట్, టీఆర్టీ లను కలిపి నిర్వహిస్తోంది. స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనుంది. ఎస్జీటీలకు 8వ తరగతి, స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలకు ఇంటర్మీడియట్, పీజీటీలకు డిగ్రీ స్థాయి వరకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. టెట్, టీఆర్టీని కలిపి వంద మార్కులకే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ వంద మార్కుల్లోనే 20% లెక్కించి టెట్ వెయిటేజీగా ఇవ్వాలని ఆలోచనగా ఉంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ నుంచి వచ్చిన షెడ్యూలు ఏరియా, నాన్ షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలల పోస్టుల్లో కొన్ని చిత్రలేఖనం, ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులు ఉన్నందున వీటికి సంబంధించిన పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. మూడు రోజుల్లో సిలబస్‌కు సంబంధించిన దస్త్రాన్ని పరీక్షల నిర్వహణ విభాగానికి అప్పగించనున్నారు.