వివాహ నిశ్చితార్థంలో లడ్డూ కోసం తాగుబోతులు వీరంగం సృష్టించడంతో పెళ్లి కుమార్తె సొంత అన్న మృతి చెందాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నందికొట్కూరులో సోమవారం చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం ఎదురుపాడుకు చెందిన మరియమ్మ, ఏసన్న దంపతుల కుమార్తెకు పాములపాడు మండలం మిట్టకందాలకు చెందిన దిబ్బన్న కుమారుడు ప్రశాంత్‌తో సోమవారం నందికొట్కూరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం రాత్రి 12 గంటలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తప్పతాగి చెన్నయ్య, ఆంజనేయులు అనే వ్యక్తులు ఇద్దరు బంతిలో కూర్చున్నారు. అదనంగా తమకు మరో లడ్డూ ఇవ్వాలని తాగిన మైకంలో వడ్డిస్తున్న జంబులయ్యతో గొడవపడ్డారు. పెళ్లి కుమార్తె సొంత అన్నయ్య రాజు వారికి సర్దిచెప్పేందుకు వెళ్లాడు. అతనిపై చెన్నయ్య, ఆంజనేయులుతో పాటు మరికొందరు కలిసి దాడి చేయడంతో ఆయువుపట్టున తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.