తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. మండల స్థాయిలో సర్పంచ్, వార్డు స్థానాల్లో రిజర్వేషన్లు నిగ్గుతేల్చే ప్రక్రియ సైతం వేగం పుంజుకుంది. గ్రామస్థాయిల్లో సర్పంచ్, వార్డుల కేటాయింపు ముగిశాక జిల్లాల వారీగా ఈమేరకు గెజిట్‌లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఈ వివరాలను రెండ్రోజుల్లో ప్రభుత్వానికి అటునుంచి ఎన్నికల కమిషన్ కు నివేదించనున్నారు. కాగా ఇప్పటికే జనరల్ కేటగిరీలో 5 వేల 147 గ్రామ పంచాయతీలు కేటాయించారు. బీసీలకు 2 వేల 345 పంచాయతీలు దక్కాయి. ఎస్సీలకు 2 వేల 113, ఎస్టీలకు 3 వేల 146 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి.
షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 12 వందల 81, వంద శాతం ఎస్టీ జనాభా కలిగిన 11 వందల 77 పంచాయతీలు వారికే దక్కాయి. మిగతా గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 688 కేటాయించారు. ఇక జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇదిలావుంటే హైకోర్టు గడువును దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 29 లోపు లేదా జనవరి తొలివారంలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఒకవైపు రిజర్వేషన్లు ఖరారు చేస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.