ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్...టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి...
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇవాళ సొంత గూటికి చేరబోతున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. అటు టీడీపీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్.కృష్ణయ్య కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కొద్ది నెలలుగా టీఆర్ఎస్ అధిష్టనం వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న డీ. శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ లో వర్గ పోరు కారణంగా ఆయన పార్టీని వీడుతున్నారు. అక్టోబర్ 11 తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరతానని ఇటీవల జరిగిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో డీఎస్ ప్రకటించారు. చెప్పినట్లుగానే కారు దిగేందుకు రెడీ అయ్యారు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు గతంలో కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో పాటు శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై డీఎస్ కుమారుడు సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో కూడా పార్టీ వీడటానికి మరో కారణం. సంజయ్ కేసు విషయంలో టీఆర్ఎస్ సర్కార్ అతిగా వ్యవహరించిందని మనస్థానికి గురైన డీఎస్..కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో వర్గ పోరు , కుమారుడి కేసు విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోకపోవడంతో డీఎస్ టీఆర్ఎస్‌ను వీడక తప్పలేదు.
మరోవైపు టీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రాములు నాయక్.. గోల్కొండ హోటల్‌లో కలిశారన్న వార్తల నేపథ్యంలో ఆయన్ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్‌లో చేరాలంటూ రాములు నాయక్‌ను అనుచరులు ఒత్తిడి చేయడంతో హస్తం గూటికి చేరాలని ఫిక్స్ అయ్యారు. రాములు నాయక్.. నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అలాగే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా సొంతగూటికి చేరబోతున్నారు. అటు కరీంనగర్ టీఆర్ఎస్ కీలక నేత చైర్మన్ తుల ఉమ కూడా రాహుల్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
ఇక 2014 టీడీపీ సీఎం అభ్యర్థి, బీసీ నేత, ఎల్.బి.నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే , బీసీనేత ఆర్.కృష్ణయ్య కూడా కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే డిల్లీ చేరుకున్నారు. వరుస చేరికలతో ఇప్పటికే జోష్‌లో ఉన్న టీకాంగ్రెస్‌కు... డీఎస్ సహా ముఖ్య నేతల రాక మరింత బూస్ట్‌నిస్తుందని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి.