తెలంగాణ పర్యటన ముగించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ పవన్ కు ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి తెలియదా అని ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని గుర్తు చేశారు.
ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో చిరంజీవికేదిక్కులేదు, తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంపై కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.
మందకృష్ణ మాదిగ కేసు నిమిత్తం కోర్టుకు హాజరైన ఆయన పవన్ పై నిప్పులు చెరిగారు. పిచ్చోళ్ల లో పవన్ పెద్దపిచ్చోడని ఎద్దేవా చేశారు. సినీ గ్లామర్ తో రాజకీయం చేయలేరని సూచించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న పవన్ తెలుగు రాష్ట్రాల సీఎం ల పనితీరు బాగుందని అంటున్నారు. అలాంటప్పుడు పవన్ పర్యటనలు ఎందుకు చేస్తున్నట్లో అని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పవన్ , సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజల్ని ఇద్దరు బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో కేసీఆర్ ను సహజ నటుడైతే పవన్ ను సినీనటుడంటూ అభివర్ణించారు. కాగా తెలంగాణ పర్యటన పూర్తి చేసుకున్న పవన్ రేపటి నుంచి అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు.