అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎం.ఎస్. ప్రభాకర్, టి.సంతోష్ కుమార్ నిన్న ఉదయం శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ ను కలిసి కాంగ్రెస్ కు చెందిన కౌన్సిల్ ను టీఆరెస్ లో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్‌కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్‌ఎస్ లో చేరారు.. కాంగ్రెస్ కు చెందిన అత్యధిక సభ్యులు తెరాస లో చేరడంతో ఛైర్మెన్ విలీన ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్‌రెడ్డిలను టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ వెంటనే బులిటెన్ రిలీజ్ చేశారు.