తెలంగాణ జిల్లా స్థాయి పదవుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత పది జిల్లాల ప్రకారమే హైకమాండ్ డీసీసీ అధ్యక్షుల్ని నియమించింది. దాదాపు అంతా పాత వాళ్ళేకే అవకాశం కల్పించగా..హైదరాబాద్ అధ్యక్షుడిగా దానంను తప్పించి అంజన్ కుమార్ యాదవ్‌కు పదవిని కట్టబెట్టారు.
కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను ఎట్టకేలకు ఏఐసీసీ చేపట్టింది. కాంగ్రెస్ హైకమాండ్ కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకోలేదు. ముందు 31 జిల్లాలకు డీసీసీలను నియమించాలని అధిష్టానం భావించినా.. సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న అనుమానంతో ఆ ఆలోచన విరమించుకుంది. దీంతో పది జిల్లాల్లో పాత వారినే కొనసాగించాలన్న తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతల ప్రతిపాదనకే రాహుల్ గాంధీ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఓబేదుల్లా కొత్వాల్, నల్లగొండ జిల్లాకు బూడిద భిక్షమయ్య గౌడ్, వరంగల్ డీసీసీగా నాయిని రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్‌కు తాహెర్ బిన్ హమ్దాన్, మెదక్ జిల్లాకు సునీతా లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ డీసీసీగా మహేశ్వర్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు గా కటకం మృత్యుంజయంలకు మరోసారి అవకాశం కల్పించారు. ఇక గ్రేటర్ ఎన్నికల తరువాత సరిహద్దు పంచాయితీతో స్తబ్దుగా ఉన్న హైదరాబాద్-రంగారెడ్డి డీసీసీలను కూడా నియామించింది. రంగారెడ్డి డీసీసీగా మరోసారి క్యామ మల్లేశంకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ..హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దానం నాగేందర్ స్థానంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను నియమించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత దానం నాగేందర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా...హైకమాండ్ ఆమోదం తెలుపలేదు. అప్పటి నుండి దానం నాగేందర్ పార్టీ కార్యక్రమాల్లో ఆంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఈ కారణంతో దానంను తప్పించి గతంలో హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. అయితే దానంకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెడుతారా..లేదంటే లైట్ తీసుకుంటారా అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు ఖమ్మం జిల్లా నేతల మద్య పంచాయితీ కారణంగా ఆ నియామకాన్ని పెండింగ్ లో పెట్టింది..హైకమాండ్. రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క .. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎవరికి వారు తమ అనుచరుల పేర్లు ప్రతిపాదించడంతో కుంతియా మధ్యవర్తిత్వంలో సాగిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఖమ్మం డీసీసీ నియామకాన్ని పక్కనపెట్టారు.
ఇక తెలంగాణ ప్రధాన పట్టణాల్లో సిటీ డిసీసీలను కూడా అధిష్టానం ప్రకటించింది. వరంగల్ సీటీ డీసీసీగా శ్రీనివాసరావు, కరీంనగర్ సిటీ డీసీసీగా కర్రా రాజశేఖర్, నిజామాబాద్ సిటీ డీసీసీగా కేశ వేణు, రామగుండం సిటీ డీసీసీగా లింగస్వామి యాదవ్‌ను నియమించారు.