ఏపీలో కలిపిన 7 మండలాల ఓటర్లపై క్లారిటీ

Update: 2018-09-25 06:04 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాల ఓటర్లపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, బూర్గంపాడు మండలాలను ఏపీలో కలుపుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఈ ఏడు మండలాల ఓటర్లపై రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ పార్టీ కోర్టును ఆశ్రయించంతో ఉమ్మడి హైకోర్టు నిన్న తీర్పు వెలువరించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాల ఓటర్ల వివాదానికి తెరపడింది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారిన పోలవరం ముంపు మండలాల సమస్యను ఎన్నికల కమిషన్ తేల్చేసింది. ఏడు మండలాల్లో ఓటర్లను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాంతో పోలవరం ముంపు మండలాల ఓటర్ల సమస్యకు తెరపడింది.

2014 ఎన్నికల తరువాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడకుండానే పోలవరం ప్రాజెక్ట్ కి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ పరిధిలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. అయితే సాంకేతితంగా ఆ ఏడు మండలాలు ఏపీకి చెందినవిగా ఉన్నా ఓటర్లు మాత్రం ఇప్పటివరకూ తెలంగాణ జాబితాలో ఉంటూ వచ్చారు. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగించడంతో ఎన్నికల కమిషన్ ఈ అంశంపై దృష్టిపెట్టి ఓటర్ల సమస్య పరిష్కరించింది. ఈ ఏడు మండలాల ఓటర్లను ఏపీలోని పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో కలుపుతూ ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈసీ గెజిట్‌ ప్రకారం భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో ఒక్క భద్రాచలం మినహా అన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పోలవరం నియోజకవర్గంలో కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక మండలాలను రంపచోడవరం నియోజకవర్గంలో విలీనం చేశారు.

Similar News