ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీలు ప్రణాళికలను సంసిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరిలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గడిచిన ఎన్నికల్లో వైసీపీనుంచి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి గెలిచారు. టీడీపీ తరుపున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి కూడా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అందులో భాగంగా ఇప్పటినుంచే రాజకీయం మొదలుపెట్టాడు. ఇటీవల కొంత మంది మహిళా సంఘాల సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇది ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది.
నియోజకవర్గంలో చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల, చిన్నగోట్టిగల్లు, తిరుపతి రూరల్ మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం డ్వాక్రా సంఘాలకు కలిపి 210 సంఘమిత్రలు ఉన్నారు. ఇందులో 175 మంది సంఘమిత్రుల వ్యక్తిగత ఖాతాల్లోకి 2వేల చొప్పున నగదు జమ అయింది. అయితే ఇది ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి లక్ష్మికాంత అకౌంట్ నుంచి వచ్చినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర దుమారం రేగడంతో వైసీపీ అప్రమత్తమైంది. తమను కావాలనే టీడీపీ ప్రభత్వం వేధిస్తోందని ఎమ్మెల్యే వర్గం భావిస్తోందో. ఆర్ధికంగా ఆదుకోవాలన్నా కుట్ర అంటగడుతోందని వైసీపీ భావిస్తోంది.ఇదిలావుంటే తనకు నెలకు నాలుగు లక్షలు ఖర్చు అయినా.. సంఘమిత్రలు సంతోషంగా ఉండాలని తన సతీమణి అకౌంట్ నుంచి డబ్బులు జమచేసినట్టు చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు ఇటువంటి ఘటనలు షరా మాములే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.