ఔను వాళ్లిద్దరు విడిపోతున్నారంటూ టీడీపీ - బీజేపీ స్నేహబంధంపై వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పై టీడీపీ బీజేపీ పై మండిపడుతుందో . ఒకానొక సందర్భంలో డీపీఆర్ ను ఓ కారణంగా చూపించిన బీజేపీ అందుకే రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని చెప్పుకొచ్చింది. దీంతో బీజేపీ తీరును తప్పు బట్టిన సీఎం చంద్రబాబు ఇవాళ ఆపార్టీ మంత్రులు, ఎంపీలతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తో పొత్తుపై నిర్ణయానికి వచ్చేందుకు ఈ భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రం కోసం పార్లమెంట్ లో ఎంపీలో పోరాడాలని, ఒకవేళ సభనుంచి సస్పెండ్ అయినా సరే రాష్ట్రప్రయోజనాల్ని గుర్తు చేసేలా వ్యవహరించాలని సూచించారు. ఇక పొత్తుపై టీడీపీ- బీజేపీలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. అయితే ఆ భేటీ అనంతరం ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చంద్రబాబునాయుడు ఫోనులో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుజనా చౌదరి సైతం ప్రెస్ మీట్లో చంద్రబాబునాయుడు ఎవరితో మాట్లాడలేదని, ఠాక్రేతో మాట్లాడారన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఎంపీలతో సమావేశం గురించి ప్రెస్ మీట్ పెట్టిన సుజనా చౌదరి కూడా ఇదే సంగతి చెప్పారు. తమ పార్టీ అధినేత ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. అవన్నీ పుకార్లు అని కొట్టి పారేశారు.
మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్డీయే కూటమినుంచి బయటకు వచ్చే ఉద్దేశం ఏదీ తెలుగుదేశం పార్టీకి లేదు అని స్పష్టం అయిపోయింది. ఇప్పటికే కాదు కదా... ఇంకా ఇలాంటి ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ.. రాష్ట్రప్రయోజనాలకు ఎంతగా విఘాతం కలిగినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలోంచి బయటకు వచ్చే సాహసం చేసే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.