గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన రేణుకా చౌదరి చట్టసభల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇలాంటివి అన్నిచోట్లా ఉన్నాయన్నారు. ఇది చేదు వాస్తమని రేణుకా చౌదరి పేర్కొన్నారు. వేధింపులకు పార్లమెంటు కూడా మినహాయింపేమీ కాదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హాలీవుడ్‌లో సాగుతున్న ‘మీటూ’ ప్రచారం తరహాలో దేశంలో కూడా బాధితులు పోరాడాలని సూచించారు.