వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగారు. 2శాతం వేతన పెంపును వ్యతిరేకిస్తూ.. ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. బ్యాంకుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ.. బ్యాంకు ఉద్యోగులు రెండురోజుల సమ్మెకు దిగారు. కేవలం 2శాతం వేతన పెంపు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ.. సమ్మె బాటపట్టారు. SBIతో పాటు 21 ప్రభుత్వరంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు.. మొత్తం 48 గంటలు ఈ సమ్మె జరుగుతోంది.
రెండు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. గ్రామీణ, మధ్య తరగతి పట్టణ ప్రాంతాలతో బ్యాంకింగ్ సేవలు లేకపోవడంతో సామాన్యులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఏటీఎమ్ లు కూడా మొరయించడంతో నగదు కటకట ప్రారంభమైంది. బ్రాంచీల పరిధిలో విత్ డ్రాయల్, డిపాజిట్ లావాదేవీలు నిలిచాయి. ఇక పలు చోట్ల బ్యాంకు ఉద్యోగులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖర్చులు భారీగా పెరుగుతున్న జీతాలు పెంచేందుకు ఐబీఏ ప్రయత్నించకపోవడం సరికాదంటూ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కేవలం బ్యాకింగ్ సెక్టార్ లో ఉద్యోగులు మాత్రమే పని చేయడం లేదని.. ఏటీఎం, డిపాజిట్ మిషన్లు, ఆన్ లైన్, మొబైల్ లావాదేవీలు యథాతథంగానే కొనసాగుతున్నట్టు బ్యాంకుల యాజమాన్యలు చెబుతున్నాయి. ఏటీఎంలో థర్డ్ పార్టీ ద్వారా ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నామని.. శుక్రవారం నుంచి బ్యాంకింగ్ సేవలు నార్మల్ గానే కొనసాగుతాయని తెలిపారు. అయితే ఈ సమ్మెకు కొన్ని ప్రయివేటు బ్యాంకులు దూరంగా ఉన్నాయి. యూనియన్‌లో ఈ బ్యాంకులు లేకపోవడంతో అవి సమ్మెలో పాల్గొనలేదు.