" అ " సినిమా రివ్యూ

Update: 2018-02-16 18:46 GMT

ఎంతో గ‌ట్స్ తో క‌థ‌ను న‌మ్ముకున్న హీరో నాని సొంత బ్యాన‌ర్ పై " అ "   సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు నిర్మాత నాని . ఈ క‌థ ను న‌మ్మి తానే సొంతంగా నిర్మించిన నాని  ఆ!! ను తెర‌కెక్కించాడు. క‌థ‌నే న‌మ్ముకున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. 
కథ
అంద‌రూ అన్న‌ట్లు ఈ సినిమాను చాలా గ‌ట్స్ తో నే తెర‌కెక్కించాడు. ప్రారంభం నుంచి సినిమా చాలా కొత్త‌గా అనిపిస్తుంది. అస‌లు క‌థ విష‌యానికొస్తే . క‌థ ఆరుగురితోనే న‌డిపించిన కొత్త  డైర‌క్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ను నిజంగా మెచ్చుకోవాల్సింది. 
భారీ తారాగ‌ణంతో ఈ సినిమా ను తెరకెక్కిన తీరుపై మంచి మార్కులో ప‌డ్డాయి. 0 స‌మాజంలో స్వంతంగా బ్రతకడం చేతకాక ఇంకొకరి మీద ఆధారపడి మోసం చేసి ఉద్యోగం చేయాలనుకున్న ఒక చెఫ్(ప్రియదర్శి), మగాళ్ళ వల్ల రక్షణ లేదు మరో కాబట్టి అమ్మయి(నిత్య మీనన్)నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఒక టీనేజ్ గర్ల్(ఈశా రెబ్బ), డ్రగ్స్ కు అలవాటు పడి డబ్బు కోసం ఏమైనా చేసే ఒక బార్ టెండర్(రెజినా), ఈగోతో రగిలిపోయే మెజీషియన్(మురళి శర్మ) ఇలా వీళ్ళందరికీ ఆర్గాన్ డొనేషన్ చేసి చచ్చిపోవాలి అనుకున్న ఒక యువతికి(కాజల్)కి కనెక్షన్ ఉంటుంది. అదే అ!!.

నటీనటులు

నలుగురు గ్లామర్ హీరొయిన్లతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా తీయ‌డంపై  అభినందించాల్సిందే.  దాదాపు వాళ్ల కెరీర్లోనే ఇలాంటి పాత్రలు మొదటిసారి చేసినందుకు అందరికి ఆ క్రెడిట్ సమానంగా దక్కుతుంది. నిత్య మీనన్, ఈశా రెబ్బ, రెజినా, కాజ‌ల్ తో ఎవ‌రిని నొప్పించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. 
కథనానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇలా చేయాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు. అందరి లోకి ఆశ్చర్య పరిచే పాత్ర రెజినాది. నెగటివ్ షేడ్స్ తో ఈ మధ్యకాలంలో ఏ కథానాయిక చేయని సాహసమే తను చేసింది. పూర్తిగా మేకోవర్ చేసుకుని మెప్పించిన తీరు నిజంగా అభినందనీయం. కాని మరీ ఎక్కువ స్కోప్ దొరకకపోవడం వల్ల ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం దక్కలేదు. నిత్య మీనన్ పాత్ర కూడా ఊహించినది కాకపోవడం ప్లస్ గా మారింది. స్పాన్ తక్కువగా ఉండటం కథ డిమాండ్ మేరకే. కాజల్ లీడ్ రోల్ లో కథకు కీలకంగా నిలిచింది. దర్శకుడు తన పాత్రను చాలా పరిమితంగా డిజైన్ చేసి కొత్త ఫ్లేవర్ ఇచ్చాడు.

ఈశా రెబ్బతోనే సినిమా ఓపెన్ అయినప్పటికీ తనది మాత్రం స్కోప్ ఉన్న పాత్ర కాదు. వంటరాని వంటవాడిగా ప్రియదర్శి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. సైంటిస్ట్ గా అవసరాల శ్రీనివాస్ కొత్త ఆహార్యంతో మెప్పించాడు. పోలీస్ గా, హీరొయిన్ తండ్రిగా ఈ మధ్య రొటీన్ గా మారిపోయిన మురళి శర్మ ఇందులో రిలీఫ్ అనిపించే పాత్రను దక్కించుకున్నాడు. కాని అది సాగతీతకు గురి కావడంతో కొంత అసహనం కలుగుతుంది . రోషిణి, ప్రగతి ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కాని అందరు తమ పరిధిలో మెప్పించిన వాళ్ళే.

సాంకేతిక వర్గం

కొన్ని సూత్రాలకు లోబడి ఉండే సౌత్ సినిమాలో ప్రయోగాలు చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. బాలీవుడ్ కు విస్తృతమైన మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ వర్క్ అవుట్ అవుతుంది. తెలుగు సినిమాలకు ప్రస్తుతానికి అంత స్కోప్ లేదు కాబట్టి పెట్టుబడి-రాబడి మీద లెక్కలు వేసుకునే మన నిర్మాతలు అందుకే అలాంటి సాహసాల జోలికి పోరు. కాని తెగించి కరెక్ట్ గా కన్విన్స్ చేసేలా చేస్తే వాటికి కూడా ఆదరణ ఉంటుందని లాస్ట్ ఇయర్ హిందీలో వచ్చిన న్యూటన్, హింది మీడియం, తుమారి సుల్లు లాంటి సినిమాలు కమర్షియల్ గా కూడా వసూళ్లు, లాభాలు రాబట్టి ఋజువు చేసాయి.

మరీ ఉత్కంటభరితంగా సాగే కథ కానప్పటికీ ఊహకు అందకుండా నడిపించారు. కాని పాత్రలు గజిబిజిగా వచ్చి పోతూ ఉండటంతో అసలు ఎం జరుగుతోందో ఎందుకు జరుగుతోందో ఒక పట్టాన అర్థం కాదు. సామాన్య ప్రేక్షకుడు దీని గురించి కాస్త బుర్రకు పని చెప్పాల్సిందే.

నిజం చెప్పాలంటే ఈ తరహా మేకింగ్ మనకు కొత్తేమి కాదు. గతంలో చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన అనుకోకుండా ఒక రోజు ఇదే కోవలోకి వస్తుంది. ఉపన్యాసాలు, సాగతీతలు లేకుండా సమాజాన్ని అంతర్లీనంగా పట్టి పీడిస్తూ పైకి ఏం జరగనట్టు నటించే ధోరణిని అందులో చూపించిన తీరులోనే ప్రశాంత్ వర్మ దీన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు కాని కట్టి పడేసే స్క్రీన్ ప్లే ఇందులో లేదు.  

అక్కడక్కడా హాలీవుడ్ సినిమాల తరహా ఛాయలు ఉన్నప్పటికీ ఆర్టిస్టుల అవుట్ పుట్ తో దాన్ని మరిపించేలా మాయ చేసాడు. గ్రాఫ్ డౌన్ అవుతోంది అనుకున్న మరుక్షణం కొత్త పాత్ర ప్రవేశించడం ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ మరో ప్రామిసింగ్ డైరెక్టర్ ఉన్నాడు కాని అంచనాలు మాత్రం అందుకోలేదు అన్నది నిజం. తాను స్పృశించింది సున్నితమైన పాయింట్ కనక దానికో పరిష్కారం చూపించకుండా యాంటీ క్లైమాక్స్ సెట్ చేయటం వల్ల పాత్ర మీద సానుభూతి కలుగుతుంది తప్ప దర్శకుడి మీద ప్రేమ కాదు. అసలు కాజల్ పాత్ర తన జీవితంలో అన్ని రకాల అనుభవాలు వివిధ వృత్తుల్లో ఉంటూ అంత చిన్న వయసులో ఎలా ఎదురుకుంది అనే అనుమానం బయటికి వచ్చేటప్పుడు కలుగుతుంది.

మార్క్ కే రాబిన్ సంగీతం అద్భుతంగా సింక్ అయ్యింది. కథ మొత్తం ఒక కెఫెటేరియాలో జరుగుతుంది కాబట్టి మూడ్ ని డైవర్ట్ చేయకుండా చక్కని అవుట్ పుట్ ఇచ్చాడు. పాటలు లేవు కనక అతని ప్రతిభను పూర్తిగా అంచనా వేయలేము కాని దీని వరకు బెస్ట్ అయితే ఇచ్చాడు. దీనికి మరో ప్రధాన ఆకర్షణ కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం. లిమిటెడ్ బడ్జెట్ లో పరిమితుల మధ్య తీసిన సినిమాను చాలా రిచ్ గా అనిపించే అవుట్ పుట్ ఇవ్వడంతో అతను మరోసారి తన టాలెంట్ చూపించుకున్నాడు.

క్లోజ్ యాంగిల్స్ లో యాక్టర్స్ ఎక్స్ ప్రెషన్స్ ని పట్టుకున్న తీరు బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఇతను టాప్ లిస్టు లో ఇంకా పైకి వెళ్లేందుకు అ!! కూడా ఒక మెట్టుగా మారనుంది. గౌతం నీరసు ఎడిటింగ్ షార్ప్ గా, అర్థవంతంగా రెండు గంటల సినిమాకు ఎంత కావాలో అంతే ఉండేలా తన డ్యూటీ తాను చేసింది. వాల్ పోస్టర్ సంస్థ కలిసిన నాని నిర్మాణ విలువలు క్వాలిటీతో ఉన్నాయి.

హెవీ బడ్జెట్ డిమాండ్ చేసే కథ కాదు కనక ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి రాజీ పడ్డారు అనే ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. తన అభిరుచిని నిర్మాత రూపంలో కూడా బయటపెట్టుకున్నందుకు నానిని అభినందించాల్సిందే. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇతర నటీనటులతో సినిమాలు నిర్మించడమనే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టడం ఇతర హీరోలకు కూడా స్పూర్తిగా నిలిస్తే బాగుంటుంది

ప్లస్ పాయింట్స్

టేకింగ్

తారాగణం

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కెమెరా

ఆర్ట్

నెగటివ్ పాయింట్స్

కమర్షియల్ అంశాలకు చోటు లేదు

కామెడీ లేకపోవడం

స్లో అనిపించే నెరేషన్

పాత్రల మధ్య కన్ఫ్యూజన్

చివరి మాట

తెలుగు సినిమా మారాలి, కొత్త తరహా కథలు రావాలి అని కోరుకోవడమే తప్ప దాన్ని ఆచరణలోకి తీసుకొద్దాం అనుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నాని చేసిన అలాంటి ప్రయత్నమే అ!!. ఎప్పుడు ఒకే తరహా సినిమాలు తీస్తారా అని విసుగెత్తిన ప్రేక్షకులు, తెలుగు సినిమాలు మారవా అని బాణాలు విసిరే విమర్శకులకు కొంత సంతృప్తి  ఇచ్చే మూవీ అ!!.

Similar News