దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 48.3 ఓవర్లలో ఆలౌట్ అయి 222 పరుగులు చేసింది. ఆ తరువాత 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు. ఆరంభంలో బాగానే ఆడినా.. 83 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఈ సమయంలో బరిలోకి దిగిన ధోనీ, దినేష్‌కార్తీక్ కలిసి 54 పరుగులు చేశారు. కాగా, 137 పరుగుల వద్ద దినేష్ కార్తిక్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ధోనీ కూడా పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా మళ్ళీ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్ కొద్దిసేపు ధాటిగా ఆడాడు. అయితే అతని కాలికి గాయంతో పిచ్ నుంచి వెనుదిరిగాడు. దీంతో రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ కలిసి స్కోర్‌ను కాస్త పెంచారు. ఈ క్రమంలో జడేజా ఔట్ కాగా.. ఆ వెంటనే భువి కూడా పెవిలియన్ చేరాడు. దీంతో జాదవ్ మళ్లీ క్రీజ్‌లోకి అడుగుపెట్టాడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 27 బంతులాడిన జాదవ్ 23 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి బంతి వరకు గెలుపు ఎవరిదో చెప్పని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఫైనల్లో భారత్ గెలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.