Mohammed Shami: ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాలంటే.. షమీ ఆ రెండు పాస్ అవ్వాల్సిందే..!
Mohammed Shami: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 2023 నవంబర్ 19న భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.
Mohammed Shami: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 2023 నవంబర్ 19న భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ అనంతరరం అతడు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాలికి శస్త్రచికిత్స జరగడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024లను మిస్ అయ్యాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడాలనుకున్నప్పటికీ.. మోకాలి వాపు కారణంగా రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు.
గాయం నుంచి కోలుకుని.. ఇటీవలే రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో బరిలోకి దిగుతాడని అందరూ అనుకున్నారు. కానీ పెర్త్ టెస్టులో షమీ బరిలోకి దిగలేదు.
మహ్మద్ షమీ పునరాగమనంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో రెండో టెస్టులో అయినా ఆడుతానని బావించారు. దీనిపై బీసీసీఐ మాత్రం సరైన సమాధానం ఇవ్వడం లేదు. తాజాగా షమీ సంబందించిన ఓ న్యూస్ బయటికొచ్చింది. షమీకి బీసీసీఐ రెండు కండీషన్లు పెట్టిందని తెలుస్తోంది. అంతేకాదు డెడ్‌లైన్ లోగా వాటిని అందుకోవాలని, అప్పుడే ఆస్ట్రేలియాకు ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంటుందని చెప్పిందట.
'బీసీసీఐ వైద్యబృందం మహ్మద్ షమీని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎలా బౌలింగ్ వేస్తున్నాడని నిశితంగా గమనిస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్‌నెస్ క్లియర్ లెటర్ వస్తేనే.. ఆస్ట్రేలియాకు పంపే విషయంపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంటుంది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ మ్యాచుల్లోనూ షమీ బౌలింగ్‌పై బీసీసీఐ దృష్టి పెట్టింది. అయితే టీ20ల్లో నాలుగు ఓవర్ల స్పెల్‌ను ప్రామాణికంగా తీసుకోలేము. షమీని పరిగణనలోకి తీసుకోవాలంటే రెండు విషయాల్లో పాస్ కావాలి, అదికూడా డిసెంబర్ రెండో వారం లోపే. డిసెంబర్ 14న మూడో టెస్టు ఆరంభం కానుంది. ఆ లోగానే షమీ బరువు తగ్గాలి, పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించాలి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి అతడిపై అనవసర ఒత్తిడి పెంచడం లేదు. అందుకే ఫిట్‌నెస్ సాధిస్తేనే మూడో టెస్టుకు పరిగణలోకి తీసుకుంటాం' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.