ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు ఖిల్లా 2019 ఎన్నికల్లో సంచలనంగా మారనుందా ? ఎన్నికలకు ముందు అధికార పార్టీలో జంప్ జిలానీలు పెరగనున్నారా ? బస్సు యాత్రతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారాయా ? కారు దూకుడుకు బ్రేకులు వేసేందుకు హస్తం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా ? అధికార పార్టీకి చెందిన నేతలు మూడు రంగుల కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా ? ఇప్పుడీ అంశాలే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మూడు జిల్లాల పరిధిలో అసలు ఏం జరుగుతుందో తెలియక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం కొందరు అధికార పార్టీకి చెందిన లీడర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలో ఇటీవలే కాంగ్రెస్ రెండో విడత ప్రజా చైతన్య యాత్ర సక్సెస్ కావటంతో ఢిల్లీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలోని కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగువెలిగిన కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీతో చెయ్యి కలుపుతారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన రాజకీయ నేపధ్యం, ప్రభావం చూపే నేతలుగా కొండా దంపతులు గుర్తింపు పొందారు. కాంగ్రెస్ లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ నేతలు. మాజీ సీఎం దివంగత నేత వైఎస్ మరణం తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ చేరి ఎమ్మెల్యే సీటును దక్కించుకున్నారు. కొండ మురళికి కూడా ఎమ్మెల్సీ దక్కింది. అయితే కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన కొండ సురేఖ కేసీఆర్ టీంలో మంత్రిగా అవకాశం లభిస్తుందని ఆశించినా ఆ ఆశ నెరవేరలేదు. దీనిపై కొండా దంపతులు కాస్త ఆసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తమ రాజకీయ ప్రత్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావు కారెక్కడం మరింత అసంతృప్తిని రాజేసింది. దీంతో సమయం కోసం ఎదురుచూస్తున్న కొండ దంపతులు తమలోని అసంతృప్తిని బయటపెట్టాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో తమ కుమార్తె సుష్మాను 2019 ఎన్నికల్లో బరిలోకి దింపి 2019లో అసెంబ్లీలో కూర్చొబెట్టాలని కొండ దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన వీరు తమకు అనుచర గణం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అయితే సుష్మాకు సీటు ఇచ్చే విషయంలో విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం స్పష్టమైన హామి ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలో రాజకీయ ప్రత్యర్ధుల వల్లే తమకు అన్యాయం జరుగుతోందని నిర్ధారణకు వచ్చి పార్టీ మారేందుకు సై అంటున్నారట. అయితే ఈ ప్రచారాన్ని కొండ సురేఖ దంపతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ వదిలి వెళ్లాల్సిన అవసరం తమకు లేదంటూనే సుష్మా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటున్నారు.
ఇక జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్య సైతం కారు దిగాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌లో తనకు సరైన గౌరవం దక్కడం లేదని భావిస్తున్న ఆయన సొంత గూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారట. మరోవైపు ఎర్రబెల్లి సొదరుడు ప్రదీప్ రావు సైతం వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. టిక్కెట్టు విషయంలో టీఆర్ఎస్ నో అంటే కాంగ్రెస్‌లో కాలు పెట్టేందుకు సై అంటున్నారు. ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య సైతం సొంత గూటికి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. డిప్యూటీ సీఎంగా తనను తొలగించి కడియం శ్రీహరికి కట్టబెట్టటంపై అసంతృప్తితో ఉన్న రాజయ్య చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇక్కడి నుంచే తన కూతురును బరిలోకి దింపాలని భావిస్తున్నారు. దీంతో రాజయ్యకు టికెట్ అనుమానంగానే మారింది. చివరి నిమిషం వరకు వేచి చూసే కంటే ఇప్పుడే పార్టీ మారీ సీటు కన్ఫమ్ చేసుకోవాలని రాజయ్య నిర్ణయించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో చేరుతారో అనేది తెలియక కార్యకర్తలు తికమక పడుతున్నారు.