విడాకులకు ముహూర్తం ?

Update: 2018-02-24 06:42 GMT

ఏపీ రాజకీయాల్లో సరికొత్త అంకం మొదలైందా? ఇప్పటివరకూ పొత్తు సంసారాన్ని కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ-బీజేపీ నేతలు ఇకపై ఆ అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారా? హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయాలంటూ చంద్రబాబు స్వరం మార్చడంతో ఏపీ బీజేపీ నేతలు కూడా గొంతులు పెకిలిస్తున్నారు. ఏకంగా చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. మిత్రబంధానికి రోజులు చెల్లాయా అన్న అనుమానాలనూ రాజేస్తోంది. 

ఏపీలో పొత్తు వ్యవహారం చిత్తవుతోందా?..టీడీపీ-బీజేపీ స్నేహానికి కాలం చెల్లినట్టేనా?..సద్దు మణిగిందనుకున్న హోదా అంశం సైరన్ మోగిస్తోందా?

ఈ అనుమానాలన్నీ రానున్న రోజుల్లో నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు ఏపీ రాజకీయాల్ని దగ్గరనుంచి పరిశీలిస్తున్న నిపుణులు. ఇటీవల కొద్ది రోజుల నుంచి చంద్రబాబు హోదా అంశాన్ని తెర మీదికి తీసుకొస్తుండడంతో ఆ బాధ్యతల నుంచి తప్పించుకున్న పార్టీగా కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఆత్మరక్షణలో పడిపోతోంది. దీన్ని ఏపీ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆధ్రాకు కేంద్రం చేయందించడంలో విఫలమైందని, విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదని, అందుకే హోదాను మళ్లీ గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. 

హోదా విషయంలో చంద్రబాబు ఇలా ప్లేటు ఎందుకు ఫిరాయించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. హోదాకన్నా కేంద్రం ఎక్కువే ఇచ్చిందన్న బాబు హోదా కోసం ఆందోళన చేసినవారిని జైల్లో పెట్టిస్తానని కూడా అన్నారని మళ్లీ హోదా పాట ఎందుకు పాడుతున్నారో చెప్పాలని వీర్రాజు ప్రశ్నించారు. 

అటు వీర్రాజు విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. టీడీపీతో పొత్తు ఉండదనుకున్నారో ఏమో రేపటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇదంతా జగన్ డైరెక్షన్ లోనే జరుగుతోందని హోదాపై తిరుపతి బహిరంగ సభలో మోడీ ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ-బీజేపీ మధ్య ముదురుతున్న మాటల వివాదాన్ని బట్టి చూస్తే ఎన్నికల సమయానికి పాత పొత్తులు విచ్ఛిన్నమై... కొత్త పొత్తులు పొడుస్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

Similar News