చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం చాపనేరులో పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి అమరనాథరెడ్డిని ఓ అవ్వే చేతిని బట్టుకుని తన గుడిసెలోకి లాక్కెళ్లింది. ఎందుకంటే...? ఆ అవ్వ ఎన్నో ఏళ్లుగా తన సమస్యలను అధికారులకు చెప్పుకుంటోంది. అయినా ఎవరూ పట్టించుకోలా. విసిగిపోయి ఉన్న అవ్వకు ఒక్కసారిగా తమ వీధిలోనే మంత్రి అమరనాథరెడ్డి కనిపించాడు. ఇంకేం పోయి ఆయనకు తన కష్టాలు చెప్పుకుంది. ముందు మా గుడిసె చూద్దువుకానీ రా అంటూ చేయి పట్టుకుని తన ఇంటికి లాక్కుపోయింది. మా ముసలోడికి పింఛను రావడంలా కాస్త చూడు నాయనా అని ప్రాధేయపడింది. చలికి, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలో ఉండలేకపోతున్నామని.. కనీసం రేకుల ఇళ్లైనా ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ఆమెకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని.. భార్యాభర్తలు ఇద్దరికీ ఫించన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.