కోడిపందేల్ని ఆపండి...హైకోర్టు తీర్పు

Update: 2018-01-03 15:22 GMT

ప్ర‌తీ సంవ‌త్స‌రం సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంటే ఏపీలో కోడిపందేల జోరు ఎలా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. కానీ  ఈ సంవ‌త్సరం కోడిపందేలు నిర్వ‌హించ‌డం అసాధ్య‌మ‌ని తెలుస్తోంది. కోడిపందేలతో కోట్ల రూపాయ‌లు చేతులు మారుతున్నాయ‌ని హైకోర్ట్ మండిపడింది. సంక్రాంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో అసాంఘీక కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌కుండా చూడాలంటూ కే.రామ‌చంద్ర‌రాజు అనే వ్య‌క్తి హైకోర్ట్ పిల్ లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పిటిష‌నర్ అభ్య‌ర్థి మేర‌కు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్ట్ కోడిపందేల నిర్వ‌హ‌ణపై హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ పై వ్యాఖ్య‌లు చేసింది. 
సీఎస్‌, డీజీపీలు  కోడిపందేల‌పై మ‌రిన్ని వివ‌రాల్ని  కోర్ట్ కు  స‌మ‌ర్పించాలని  ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ సంద‌ర్భంగా కోడిపందేలపై 2016 డిసెంబర్‌ 26న ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ వేర్వేరుగా సమర్పించిన వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. 

Similar News