టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరనున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతుండగా, ఆయన్ను కలవనున్న ఆనం వైకాపా కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి, ఆపై రాష్ట్ర విభజన తరువాత క్రియాశీల రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఆయన ఉన్నారన్న సంగతి తెలిసిందే. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో గూడు కట్టుకుని ఉంది. దీంతో కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆనం ఆదివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.