ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్, చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు, ప్రముఖ తమిళ నటుడు సూర్య నుంచి అనూహ్య మద్దతు లభించింది. "ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన, ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు" అని ఆయన వ్యాఖ్యానించాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు వైఎస్‌ఆర్ కుటుంబంతో పరిచయం ఉందని సూర్య చెప్పారు. వైఎస్ జగన్, తాను కలుసుకొని మాట్లాడినప్పుడు రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావని.. అయినా ప్రజలకు ఏదో చేయాలన్న తపన వైఎస్ జగన్ లో గమనించానని సూర్య అన్నారు. మహానేత, దివంగత సీఎం రాజశేఖరరెడ్డిని కోల్పోవడం తీరని లోటని చెప్పారు. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చాలా ప్రాధాన్యం కలిగిందని.. ప్రస్తుతం జగనన్న చేస్తున్న పాదయాత్ర కూడా అదే తరహాలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సూర్య పేర్కొన్నారు.