హీరోయిన్ అమలాపాల్ పోలీసులకు లొంగిపోయారు. కేరళలో రూ. కోటి రూపాయల విలువ చేసే కారు కొనుగోలు చేసిన అమలాపాల్ రిజస్ట్రేషన్ మాత్రం పాండిచ్చేరిలో చేయించింది. సమాచారం తెలుసుకున్న కేరళ ట్రాన్స్ పోర్టు అధికారులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆమె సుమారు. 20లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను కేరళ హైకోర్టులో హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అమలా పాల్ కోర్టులో హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరిపింది. దీంతో కేరళ కోర్టు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తర్వాత కేసు పరిశీలిస్తామని పేర్కొంది. దీంతో అమలాపాల్ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులను కలిసిన తర్వాత అమలాపాల్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.