YS Jagan: లండన్‌కు వెళ్తా.. పర్మిషన్ ఇవ్వండి..సీబీఐ కోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్
YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. తాను లండన్ వెళ్తానని అనుమతించాలని కోరుతూ పిటిషన్ వేశారు. కాగా అక్రమఆస్తుల కేసులో జగన్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
YS Jagan: బ్రిటన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. లండన్ లో ఉంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటివారంలో వెళ్లేందుకు పర్మిషన్ కావాలని కోరారు. ఈ పిటిషన్ పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం సిబిఐ వివరణ కోరుతూ విచారణను నేటికి వాయిదా వేశారు.
ఇక యూరప్ లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా సిబిఐ కోర్టును ఆశ్రయించారు. విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై సిబిఐ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే విచారణ ముందుకు సాగడం లేదని..అనుమతి ఇవ్వకూడదని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 30వ తేదీకి నిర్ణయాన్ని వాయిదా వేశారు.