పవన్‌ నోట..పదేపదే అదే మాట ఎందుకు?

విలీనంపై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీని కలిపేయాలని ఓ పెద్ద పార్టీ నుంచి ప్రెషర్‌ తీవ్రమైంది. అయినా పార్టీని మెర్జ్‌ చేయను. ఒక్క కార్యకర్త ఉన్నా, పార్టీని నడుపుతాను.

Update: 2019-08-20 12:09 GMT

విలీనంపై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీని కలిపేయాలని ఓ పెద్ద పార్టీ నుంచి ప్రెషర్‌ తీవ్రమైంది. అయినా పార్టీని మెర్జ్‌ చేయను. ఒక్క కార్యకర్త ఉన్నా, పార్టీని నడుపుతాను. ఈ మాటలు ఎవరన్నారో అర్థమైంది కదా. జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒకసారైతే ఏదోలే అనుకోవచ్చు. పదేపదే విలీనం చెయ్యను, చెయ్యను అని ప్రకటించడం ద్వారా, పవన్‌ కల్యాణ్‌ ఇస్తున్న మెసేజ్‌ ఏంటి ఎవరు ఒత్తిడి తెస్తున్నారు ఏ పార్టీ విలీనాన్ని కోరుకుంటోంది అసలు రహస్యంగా సమాధికావాల్సిన విలీన ప్రతిపాదనలను, బయటకు చెప్పడం ద్వారా పవన్‌ ఉద్దేశమేంటి?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, కొద్దికాలంగా ఒకే మాట పదేపదే చెబుతున్నారు. ఆ మాటతో పార్టీ నేతల్లోనే అయోమయం పెరుగుతోంది. ఆ మాటల వెనక అర్థమేంటో, పరమార్థమేంటో బోధపడక కార్యకర్తలు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. ఇంతకీ ఆ మాట ఏంటంటే, జనసేనను విలీనం చెయ్యాలని, ఓ పెద్ద పార్టీ నుంచి ఒత్తిడి తెస్తున్నారని. జనసేన పార్టీని ఓ పెద్ద పార్టీ తమ పార్టీలో కలిపేయాలని తనపై ఒత్తిడి చేస్తోందన్నారు పవన్ కల్యాణ్. అయితే తన‌పై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా జనసేనను మాత్రం, తాను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తి లేదన్నారు. జనసేన పార్టీని జాతీయ సమగ్రత కాపాడ‌డం కోసం విలువల కోసం తాను స్థాపించాన‌ని, అలాంటి పార్టీని తాను ఏ పార్టీలోనూ క‌ల‌ప‌న‌ని స్పష్టం చేశారు పవన్.

సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత రెండు నెలలకు పైగా గ్యాప్ తీసుకుని, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు పవన్. తాజాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో సమావేశమైన పవన్, విలీనంపై మరోసారి మాట్లాడ్డం చర్చనీయాంశమైంది. పదేపదే విలీన కామెంట్లు ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికీ అర్థంకావడం లేదని, పార్టీలోనే చర్చ జరుగుతోంది.

విలీన ప్రతిపాదన తెస్తున్న ఆ పెద్ద పార్టీ ఏది?

ఎవరి నుంచి పదేపదే విలీన ఆఫర్లు వస్తున్నాయి?

ఏ పార్టీ నుంచి విలీన ప్రతిపాదన వస్తోందో అర్థం చేసుకోవానికి, బుర్రను మధించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, ఏపీలో బలంగా ఉన్నవి రెండే రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ. వీటి నుంచి ఆఫర్లు వచ్చే అవకాశమే లేదు. ఇక కాంగ్రెస్‌ ఉన్నాలేనట్టే. కాంగ్రెస్‌ ఆఫరిచ్చినా, జనాలు ఆదరించే ఛాన్సేలేదని పవన్‌కు తెలుసు. ఇక మిగిలినది ఒకే ఒక్కటి. అదే బీజేపీ. ఏపీలో ఎలాగైనా ఎదగాలని కంకణం కట్టుకుని, వరుసగా టీడీపీ, కాంగ్రెస్‌ నేతలను చేర్చుకుంటున్న పార్టీ. విలీనం చెయ్యాలని ఒత్తిడి తెస్తున్న పార్టీ బీజేపీయేనని అందరికీ అర్థమవుతోంది. ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, పవన్‌ను కలిసిన కొందరు వ్యక్తులను బట్టి కూడా, ఇదే అవగతమవుతోంది.

పవన్ అమెరికా వెళ్లినప్పుడు, కొన్ని కీలక పరిణామాలు జరిగినట్టు ప్రచారం జరిగింది. అక్కడ బిజెపి నాయకుడు రాంమాధవ్‌తో పవన్‌ సమావేశమయ్యారన్న చర్చ సాగింది. అదే సమయంలో రామ్ మాధవ్, పవన్‌కు విలీన ఆఫర్ చేశారట. జనసేనను, తమ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ముఖ్యుల దగ్గర ఈ ప్రస్తావన తెచ్చి, వారి అభిప్రాయాలను తీసుకున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది. పవన్‌-రాంమాధవ్‌ల భేటి జరిగినట్టుగా వస్తున్న వార్తలతో, ఒక్కసారిగా విలీనాగ్ని రాజుకుంది. దీంతో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని భావించిన పవన్, తమ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని, కచ్చితంగా పార్టీని నడిపించి తీరుతానని పదే పదే ప్రకటిస్తున్నారని తెలుస్తోంది.

విలీన ప్రతిపాదన బయట పెట్టడంలో భావమేమి?

అదే పనిగా విలీనంపై పవన్‌ ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఎవరికీ బోధపడ్డం లేదు. ఒకవేళ పార్టీని విలీనం చేయాలని ఎవరైనా ప్రపోజల్ పెడితే, చిరంజీవిలా ఇష్టముంటే చేసెయ్యాలి. నచ్చకుంటే చేయనని చెప్పేయాలి. ఇలాంటి సంచలన ప్రతిపాదన ఏదైనా ఉందంటే, అది వారి మధ్యే వుండాలి. మరి ఈ వ్యవహారాన్ని బయట ఎందుకు పెడుతున్నట్లు? అన్నది పవన్ కళ్యాణ్ విషయంలో గట్టిగా రైజ్‌ అవుతున్న బిగ్‌ క్వశ్యన్. నిజంగానే కాషాయ పార్టీ విలీనంపై ఒత్తిడి తెస్తోందా లేదంటే అదే పనిగా పవనే ఫీలవుతున్నారా అన్నది, కార్యకర్తలకే అంతుచిక్కడం లేదు.

పదేపదే అనేక వేదికల మీద పవన్ కల్యాణ్‌, విలీనం చేసేది లేదంటూ చెబుతూ, తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని, జనసైనికులు అంటున్నారు. ఈ మాట చెప్పడం ద్వారా, కార్యకర్తల్లో భరోసా నింపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తనపై ఆశలు పెట్టుకున్న వారికీ పాజిటివ్ సంకేతాలు పంపాలని అనుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంతేకాదు, తనపై ఒత్తిడి తెస్తున్న జాతీయ పార్టీకి కూడా స్ట్రాంగ్ మెసేజ్‌ పంపాలన్న ఉద్దేశమూ కావచ్చు. విలీనం చేసేది లేదన్న ప్రకటనలతో, మరోసారి సదరు జాతీయ పార్టీ ప్రయత్నాలు చేయదన్న ఆలోచనా కావచ్చంటున్నారు జనసైనికులు.

అయితే పరోక్షంగా బీజేపీని ఉద్దేశించే, పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతున్నా, ఆ పార్టీ మాత్రం అసలు నోరెత్తడం లేదు. పవన్‌పై ఆశలు పెట్టుకోవడం నిజమో కాదో కూడా, బహిరంగ వ్యాఖ్యానాలు కూడా చేయడం లేదు. పవన్ కళ్యాణ్ కామెంట్లనూ ఖండించడం లేదు. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ విలీన ప్రకటనలు పదేపదే చెయ్యడం మాత్రం, కార్యకర్తలను కంగారుపెట్టిస్తోంది. మరోసారి చిరంజీవి ప్రజారాజ్యం రోజులు గుర్తొచ్చి, నేతలు దడుసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. పార్టీ ఉనికినే గందరగోళంలో పడేసే ఇలాంటి వ్యాఖ్యలను వదిలేసి, పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Full View

Tags:    

Similar News