కోడెల శివప్రసాదరావు అసలెలా చనిపోయారా? మొదటగా ప్రచారం జరిగినట్టుగా గుండెపోటు వచ్చిందా? కుటుంబీకులు చెబుతున్నట్టుగా ఉరేసుకొని ఊపిరి తీసుకున్నారా? ఆయన బంధువు అంటున్నట్టు కోడెలను హత్య చేశారా? కోడెల అనుమానాస్పద మరణం వెనుక అసలేం జరిగింది? తెలుగుదేశంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న కోడెల ఎందుకిలా చేసుకున్నారు.?
కోడెల ఎందుకు ఊపిరి తీసుకున్నారు?
కోడెల ఆత్మహత్య కారణాలేంటి?
సొంత పార్టీ అంటున్నట్టు రాజకీయ వేధింపులా?
సన్నిహితుతు చెబుతున్నట్టు కుటుంబ స్పర్థలా?
అసలు కోడెల ఎందుకిలా చేసుకున్నారు?
కోడెలది తలదించని వ్యక్తిత్వం. తలవంచని మనస్తత్వం. గుంటూరు జిల్లాలో ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కోడెలను గుర్తుపట్టని వారుండరు. రాజకీయరంగాన ఉద్దండ పిండంగా మారి ఆధునిక రాజకీయానికి అసలైన అర్థం చెప్పిన నాయకుడని కోడెలకు పేరు. అలాంటి నాయకుడిని కొన్నాళ్లుగా కొన్ని సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని పరిస్థితులు తలవొంపులు తెచ్చిపెడుతున్నాయ్. మానసికంగా అలసిపోయేలా చేస్తున్నాయ్. రాజకీయ వేధింపులే కోడెల కొంప ముంచాయని కొందరు చెబుతుంటే కుటుంబ స్పర్థలే కూలదోశాయని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ కోడెల ఎందుకు ఊపిరి తీసుకున్నారు?
తిరుగులేని నేతగా, ఎదురులేని నాయకుడిగా ఎదిగిన కోడెల శివప్రసాద్‌రావుకు మొన్నటి ఎన్నికల నుంచే గడ్డుకాలం మొదలైందని చెబుతున్నారు సన్నిహితులు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనెమట్ల కోడెలపై ఎదురుతిరిగారు అక్కడి ప్రజలు. ఇనెమట్ల పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేస్తున్నారన్న అభియోగంతో కోడెలపై దాడికి దిగారు. ఆ ఘటనతోనే కోడెల శివప్రసాద్ మానసికంగా దాదాపుగా కుంగిపోయారు.
తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తమ్మినేని స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతా సాఫీగా, సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో నాటి స్పీకర్‌గా కోడెల ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్‌ను దొంగిలించారన్న అభియోగం ఒకటి తెరపైకి వచ్చింది. కోడెల ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఫర్నీచర్ కోసం వెతికారు. ఇంతలోనే కోడెల కుమారుడు శివరామ్‌కు చెందిన ఒక షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్ కనిపించడంతో కోడెల కుమిలిపోయారు.
ఐదుసార్లు నరసరావుపేట నుంచి, ఒకసారి సత్తెనపల్లి నుంచి విజయం సాధించిన కోడెల మొత్తం ఆరుసార్లు విజయం సాధించారు. దాదాపు 35 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా పేరు సంపాదించుకున్న కోడెలకు ఈ పరిణామాలు మనసును మెలిపెట్టాయి. ఇది చాలదన్నట్టుగా కుటుంబంలో కూతురు, కుమారుడితో తరుచూ గొడవలు, వివాదాలతో కోడెల మనసు చెదిరిపోయిందంటున్నారు సన్నిహితులు. రాజకీయ వేధింపులు కూడా దీనికి తోడయ్యాయని చెబుతున్న సన్నిహితులు కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కన్నీటి పర్యంతమవుతున్నారు.