Weather Updates: ముసురుకున్న రాష్ట్రం.. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
Weather Updates: మూడు రోజులుగా ఏపీ రాష్ట్రం ముసురుకున్నట్టే కనిపిస్తోంది. కనీసం బయటకు వెళ్లేందుకు అర గంటపాటు సమయం లేకుండా నిరంతరం కురుస్తూనే ఉంటోంది.
Weather Updates: మూడు రోజులుగా ఏపీ రాష్ట్రం ముసురుకున్నట్టే కనిపిస్తోంది. కనీసం బయటకు వెళ్లేందుకు అర గంటపాటు సమయం లేకుండా నిరంతరం కురుస్తూనే ఉంటోంది. ఇదే పరిస్థితి మరో రెండు, మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వీటి ప్రభావంతో రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనివల్ల అవసరాలు ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం వల్ల తీవ్రత మరింత పెరుగుతుందని, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో..
► ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆదివారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు.
► తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
► ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
► రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
► సహాయక చర్యల కోసం రెండు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించామని.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలనూ సిద్ధం చేశామన్నారు.
'ముసురు'కున్న రాష్ట్రం
పలు జిల్లాల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ముసురేసింది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరరామచంద్రాపురంలో 10 సెంమీ, కూనవరంలో 8, కుక్కునూరు, వేలేరుపాటు, చింతూరులో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.