Weather Updates: మరో పన్నెండు గంటల్లో తీవ్రంగా మారనున్న వాయుగుండం..ఏపీ ఉత్తరకోస్తాలో భారీ వర్ష సూచన!
Weather Updates బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రం గా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రం గా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాబోయే పన్నెండు గంటల్లో మరింత బలపడనుండి. దీంతో ఇది తీవ్ర వాయుగుండంగా మారవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తున్న ఈ ఈ వాయుగుండం.. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది విశాఖపట్నానికి 280 కిలోమీటర్లు ఆగ్నేయంగా, కాకినాడకు 320 కి.మీటర్లు తూర్పు ఆగ్నేయంగా, నరసాపూర్ కు తూర్పు ఆగ్నేయదిశలో 360కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెబుతున్నారు. ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ లోని నరసాపూర్-విశాఖపట్నం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉత్తర కోస్తాఆంధ్ర.. ఉభయగోదావరి జిల్లాలకు హెచ్చరిక..
ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ౨౦ సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగానూ అప్రమత్తం అయింది. వాయుగుండం పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందనీ, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దనీ ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.