తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు హైస్కూల్ లో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. తమను విమర్శించే నాయకులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే ఏం చేయకుండా నిశ్చలంగా ఉండండి.. హోం శాఖ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండని ఆయన చెప్పారు. ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా? బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? అని అడిగారు. తాను హోంశాఖ తీసుకోలేక కాదు.. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. యూపీలో క్రిమినల్స్ కు యోగి ఆదిత్యనాథ్ ఎలా చేస్తున్నారో... ఇక్కడ కూడా అలానే చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
క్రిమినల్స్ ను వెనకేసుకు రావాలని చట్టాలు చెబుతున్నాయా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తెగేదాకా లాగొద్దని ఆయన సూచించారు. ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉందని చెప్పారు. అధికారంలో ఉన్నందున సంయమనంతో ఉన్నామని ఆయన చెప్పారు. ప్రజల ఆవేదనను డీజీపీ, ఇంటలిజెన్స్ అధికారుల దృష్టికి తాను ఇలా తీసుకురావాల్సి వస్తోందని ఆయన చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు, కలెక్టర్లకు చెప్పారు. తప్పులు చేసినవారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండి.. నేను ఎవరినీ వెనకేసుకు రావడం లేదన్నారు. హోంమంత్రిగా అనితకు కూడా చెబుతున్నా.. మంత్రిగా మీరే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.