Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్ష సూచన..ఐఎండీ అలర్ట్
Heavy Rains: శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతారణ శాఖ చెబుతోంది. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారి బలపడుతుందని భారత వాతవరణ విభాగం ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ అల్పపీడనం తుపాన్ గా మారి బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27నాటికి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారి సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
గతవారం కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడనం ప్రభావంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీవర్షం కురిసింది. నెల్లూరు, గూడురు, కావాలిలో భారీ వర్షం కురవడంత వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
తాజా తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో భయాందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈసమయంలో తుఫాన్ వస్తే తమకు పంట నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి అందించే సమయంలో తుఫాన్ ముప్పు వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు తెలంగాణపై చలి పంజా విసురుతోంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. నగర శివారులో గత రెండు మూడు రోజుల నుంచి చల్లటి గాలులు వణికిస్తున్నాయి. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.