Pawan Kalyan: ఏపీ కూటమి ప్రభుత్వంలో పవర్ స్టార్

Pawan Kalyan plans in AP politics: పవన్ కల్యాణ్... కూటమి సర్కారులో మరింత పవర్‌ఫుల్ లీడర్‌గా నిలదొక్కుకుంటున్నారా?

Update: 2024-11-22 01:45 GMT

Pawan Kalyan

Pawan Kalyan plans in AP politics: పవన్ కల్యాణ్... కూటమి సర్కారులో మరింత పవర్‌ఫుల్ లీడర్‌గా నిలదొక్కుకుంటున్నారా? పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవనాలను గుణపాఠాలుగా తీసుకుని రాటు దేలుతున్నారా? ఇంతకాలం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. ఇపుడు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గే పనిలో ఉన్నారా! ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014 ఒక లెక్క.. 2019 మరో లెక్క.. 2024 అసలు లెక్క.. ఇది పవన్ కళ్యాణ్ లెక్క.. అక్షరాలు, అంకెలు, గుణింతాలు, హెచ్చవేతలు అన్నీ పక్కగా ఉన్నాయో లేదో ఎప్పటికపుడు సరిచూసుకుంటూ పవన్ ముందుకెళుతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ వేసుకుంటున్న ఆ లెక్కేలేంటో తెలియాలంటే మనం ఈ డీటెయిల్డ్ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

2014లో తెలుగుదేశం-బీజేపీ కూటమికి మద్దతిచ్చి అండగా నిలిచిన తరువాత తనకెదురయిన అనుభవాలను బేరీజు వేసుకుంటూ బలమైన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే పనిలో పవన్ నిమగ్నమయ్యారు. 2014లో టీడీపీ-బీజేపీ ద్వయానికి తాను మద్దతు పలికింది మొదలు 2024 వరకు జరిగిన రాష్ట్రంలోని అనేక రాజకీయ పరిణామాలు పవన్ కు గుణపాఠాలు నేర్పాయి. ప్రత్యేకించి 2014 నుంచి 2019 దాకా టీడీపీ నుంచి తనకెదురయిన అనుభవాలకు మళ్ళీ ఆస్కారం లేకుండా తనను టచ్ చేయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా తనను తాను పటిష్టం చేసుకుంటున్నారు.

2014లో టీడీపీ - బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కొద్ది కాలానికే పవన్ తో మైత్రి బెడిసి కొట్టింది. పవన్ కు ఎన్నో అవరోధాలేర్పడ్డాయి..మరెన్నో అవమానాలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవింతంపైనా, కుటుంసభ్యులపైనా చేస్తున్నకామెంట్లపై పవన్ కళ్యాణ్ బహిరంగసభల్లోనూ భగ్గుమన్న సందర్భాలున్నాయి. పవన్ ద్వారా అధికారంలోకి వచ్చామన్న భావనను పూర్తిగా తొలగించేందుకు తెలుగుదేశం నాయకులు చేయాల్సిందంతా చేశారు.

Full View

టీడీపీతో ఎదురుదెబ్బలు

అపుడు టీడీపీ సర్కారులో అవినీతిపై పవన్ ప్రశ్నించటమే దానికి కారణం. అలా తీవ్రమైన విబేధాలు ఏర్పడటం వల్లనే 2019లో ఒంటరిగా పోటీ చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకారి అనీ, చంద్రబాబే ఎంతో నయమనీ, తాను ఒంటరిగా పోటీ చేసి పెద్ద తప్పు చేశానన్న భావనను పవన్ కళ్యాణ్ అనేక సార్లు వ్యక్తం చేశారు. అందువల్లనే వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఎన్డీఏతో టీడీపీని కలిపేందుకు సర్వశక్తులు ఒడ్డారు.

తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నపుడు, చంద్రబాబు జైలు పాలయినప్పుడు నైతికంగా అండగా నిలిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చాక రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన’ కలిసి పనిచేస్తుందని సంచలన ప్రకటన చేశారు. అక్కడ నుంచి టీడీపీతో, ప్రత్యేకించి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ బంధం 2014కు మించి మరింత బలపడింది. ఆ తరువాత బీజేపీ కూడా కలవటం..మూడు పార్టీల కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకోవటం..కేవలం 11 సీట్లతో జగన్ ఘోర పరాయజం పాలుకావటం అందరికీ తెలిసిందే.

బీజేపీతో బంధమే పవన్ బలమా?

బీజేపీతో, ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కు బలమైన బంధముంది. ఈ బంధమే ఏపీలో పవన్ ను మరింత స్ట్రాంగ్ చేస్తుందని రాష్ట్రంలో కూటమి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితకాలంలో ఏనాడూ సమాంతర నాయకత్వాన్ని గుర్తించిన, ప్రోత్సహించిన దాఖలాలు లేవు. టీడీపీ పూర్తిగా ఎన్జీఆర్ నుంచి తన చేతికి వచ్చాకైతే ఆ పార్టీకి అన్నీ తానే అయ్యారు. 2014కు ముందు అడపాదడపా బీజేపీతో స్నేహం చేసినా చంద్రబాబు దరిదాపుల్లోకి వచ్చే నాయకెడవ్వరు బీజేపీలో లేరు.

ఇప్పుడలా కాదు. కూటమిలో పవన్ ది ఫెద్ద ఫోర్స్. అంతేకాదు, కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డారన్న కృతజ్ఞత కూడా చంద్రబాబుకు తప్పనిసరిగా ఉంటుంది. అది మాత్రమే పవన్ కు చాలదు. పాలిటిక్స్ లో కమిట్ మెంట్స్ ఉండవన్న పరిజ్ఞానం పదేళ్ల అనుభవం ద్వారా పవన్ కళ్యాణ్ కు కూడా తెలిసొచ్చింది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ అనే రెండు బలమైన రాజకీయ వ్యవస్థలకు సమానంగా మూడో ప్రత్యామ్నాయ బలంగా నిలబడాలంటే తన శక్తి సరిపోతుందా...నిజంగా ఆ శక్తే ఉంటే ఎన్నికల్లో 21 సీట్లకు ఎంతు ఎందుకు పరిమితమవుతారు?

ఏపీ రాజకీయాల్లో కులాల బలాలు

వైసీపీకి రెడ్లు పునాది.. టీడీపికి కమ్మవారు పునాది. ఈ రెండూ బలమైన వ్యవసాయ, పారిశ్రామిక కులాలు. ఆ పార్టీలు సాంతం కింద పడిపోయివనా అంతే బలంగా వాటిని నిటబెట్టే శక్తి సామర్థ్యాలు ఆ కులాలకు ఉన్నాయి.. మరి, జనసేన సంగతేమిటి? తనకు కులం లేదని పవన్ ఎన్ని చెప్పినా ఆ పార్టీకి కాపులే పునాది. వర్కింగ్, సెమీ వర్కింగ్ క్లాస్ కు చెందిన కాపు కులం సంఖ్యా బలం ఎక్కువే కావచ్చు. కానీ, రాష్ట్రంలో ఎన్నికలను సొంతగా లీడ్ చేసే ఆర్ధిక స్థోమత వారికి లేదు. అంతకుమించి కూటమిలోని టీడీపీ నుంచీ గానీ, బయట వైసీపీ నుంచి గానీ జనసేన ను దెబ్బతీసే వ్యూహాలు పన్నితే వాటిని ఎదుర్కొనే సామ దాన బేధ దండోపాయాలు కూడా జనసేన వద్ద చాలినంతగా లేవు. అందువల్లనే పవన్ 2014 అనంతరం ఏర్పడిన అనుభవాలు, అవమానాలను బేరీజు వేసుకుని బీజేపీ అనే భారీ రాజకీయ వ్యవస్థకు దగ్గరయ్యారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు దిల్లీ నుంచి పిలుపులు రావడం, హుటాహుటిన వెళ్ళడం, బీజేసీ సీనియర్ నేత, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతుండడం వంటి పరిణామాలు పవన్ రాజకీయ స్థిరత్వానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ భేటీల వెనుక ఏం జరుగుతోందనే చర్చలు రాష్ట్రంలో తీవ్రంగానే జరుగుతున్నాయి. ఈ చర్చలే పవన్ భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సంబంధించిన ఊహలకు ఉప్పూ కారం అందిస్తున్నాయి.

పవన్ పొలిటికల్ ఎక్స్‌టెన్షన్...

ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారానికి వెళ్ళడం కూడా రాజకీయంగా కీలకమైన మలుపు అనే విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఆయన సభలకు అక్కడిజనం తండోపతండాలుగా హాజరయ్యారు. అది పవన్‌కు రాజకీయంగా ఒక ఎక్స్ టెన్షన్.

అంతకుముందు, తిరుపతి లడ్డు విషయంలో పవన్ చేసిన హంగామా ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. పవిత్ర క్షేత్ర ప్రక్షాళన కోసం ఆయన దీక్ష పూనారు. సాధువుల్లా వేషధారణ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ తిరుపతి సభలో ఆవేశంతో ఊగిపోయారు. సభకు వచ్చిన వారికి పూనకాలు తెప్పించారు. ఆ విధంగా ఆయన ఆర్ ఎస్ ఎస్ భావజాలం నిండిన హిందుత్వ వాదుల కన్నా తానేం తక్కువ కాదని నిరూపించారు. అదంతా చూసినవాళ్ళకు పవన్ పొలిటికల్ జర్నీ ఫ్లాష్ బ్యాక్ కళ్ళ ముందు రివ్వున తిరుగుతుంది. చె గవేరా పోస్టర్లతో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన పవన్ లెఫ్ట్ నుంచి పూర్తి గా రైట్ కు చేసిన ప్రయాణం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది ఏమైనా, రాజకీయాలను, రాజకీయ నాయకులను పరిస్థితులు ప్రభావితం చేస్తుంటాయి. సైద్ధాంతిక భూమిక అన్నది రాజకీయాల్లో అపరిచిత పదజాలంగా మారిపోయిన ప్రస్తుత ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రాగ్మటిస్ట్ పోకడలకు పవన్ ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్.

ఈ విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా... వేగంగా మారుతున్న ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా కనిపిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో తన గొంతు వినిపించి వచ్చారు. అంటే, దక్షిణాది రాజకీయాలకు సంబంధించి బీజేపీ అగ్ర నాయకత్వం ఆయనకు ఈసారి రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చేసిందనుకోవాలా? ఏదేమైనా, ఇప్పుడు ఆయన బీజేపీకి అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్. ఏపీలో బీజేపీకి పవన్ తో చాలా అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కు కూడా బీజేపీ అవసరం అంతే ఉంది. రాజకీయాల్లో విన్ విన్ సిచ్యువేషన్ మించింది మరేముంటుంది. అందుకే, పవన్ కల్యాణ్... ఇప్పుడు పవర్ కల్యాణ్.

Tags:    

Similar News