AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకు?
AP Mega DSC 2024: ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6న రిలీజ్ కానుంది. 16వేలకు పైగా పోస్టులతో ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువరించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఏపీలో మెగాడీఎస్సీకి సర్వం సిద్ధం చేస్తోంది పాఠశాల విద్యాశాఖ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు తొలిసంతకం చేశారు. గత జులైలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అయినా టెట్ నిర్వహణ కోసం దానిని వాయిదా వేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఒకే ఏడాదిలో రెండోసారి టెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. సోమవారం టెట్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి.
ఇక టెట్ రిజల్ట్స్ వెలువడినవెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి..రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు డీఎస్సీ నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించి మెగా డీఎస్సీ 2024 ఉద్యోగనియామక ప్రకటన నవంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డీఎస్సీ నియామకాల ఫైలుపై తొలిసంతకం చేశారు.
కాగా వైసీపీ సర్కార్ ఎన్నికల ముందు 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షలు నిర్వహించలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ పై కసరత్తు చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. నవంబర్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవ్వనుంది. నెల రోజులపాటు దరఖాస్తులు స్వీకరించే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 6 వరకు నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.