Dadisetti Raja: దాడిశెట్టి రాజాకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు..
Dadisetti Raja: దాడిశెట్టి రాజాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది.
Dadisetti Raja: దాడిశెట్టి రాజాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2019లో తుని రూరల్ లో ఓ దినపత్రిక విలేకర్ కె. సత్యనారాయణ హత్యకు గురయ్యారు.
ఈ హత్య కేసుకు సంబంధించి అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి.రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు తిరిగి ఓపెన్ చేశారు పోలీసులు. దీంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అసలు ఏం జరిగింది?
తుని రూరల్ లో ఓ దినపత్రికలో కాతా సత్యనారాయణ విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయన వయస్సు 47 ఏళ్లు. 2019 అక్టోబర్ 15న రాత్రి ఏడు గంటల సమయంలో తన బైక్ పై ఎస్. అన్నవరంలోని ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలోని లక్ష్మీదేవి చెరువుగట్టుపై కొందరు గుర్తు తెలియని దుండగులు అడ్డగించి ఆయనను చంపారు. ఈ హత్యకు అప్పటి మంత్రి దాడిశెట్టి రాజా ప్రధాన సూత్రధారి అని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఈ విషయమై అప్పట్లో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దాడిశెట్టి రాజాతో పాటు ఆరుగురిని నిందితులుగా చేర్చారు. 2023లో పోలీసులు దాఖలు చేసిన చార్జీషీట్ లో దాడిశెట్టి రాజా పేరు లేదు. సత్యనారాయణ హత్యపై ఆయన సోదరుడు గోపాలకృష్ణ పోరాటం చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్ హెచ్ ఆర్ సీ తో పాటు హైకోర్టును ఆశ్రయించారు.