Jayaprakash Narayana about YS Jagan govt: ఏపీలో ఇదివరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం సంపద ఎలా పెంచాలో అనే విషయంపై దృష్టిపెట్టకుండా కేవలం బటన్లు నొక్కడంపైనే దృష్టిపెట్టిందన్నారు. ఏపీకి ప్రస్తుతం 9.64 కోట్ల అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సగం ఆ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు పోతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులతో పోల్చుకుంటే దేశంలో మరే ఇతర రాష్ట్రాలకు ఈ స్థాయిలో అప్పులు లేవని జయ ప్రకాశ్ నారాయణ స్పష్టంచేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జయ ప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై నమ్మకం ఉంది..
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించిందని జయ ప్రకాశ్ నారాయణ ఆరోపించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధిపథం వైపు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజలకు కూడా చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉందన్నారు. ఏపీకి రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు.